రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. శుక్రవారం (జూన్ 12) నాటికి అన్ని క్యారెట్ల బంగారం ధరలతో పాటు వెండి రేట్లు కూడా భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 2,700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 2210 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,580గా నమోదైంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,700 పెరిగి రూ.1,36,200కు చేరింది.
18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.1,11,440కు చేరుకుంది. ఈ పెరుగుదలతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5,000 పెరిగి రూ.2,65,000కు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.
గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాయి.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల, డాలర్ మారకపు విలువలో మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను పరిశీలించి, తమ అవసరాలు, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడంతో ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధరల ఈ ఎగసిపడే ధోరణి ఎప్పుడు స్థిరపడుతుందో వేచి చూడాల్సి ఉంది.







