HMD గ్లోబల్ సంస్థ తన Vibe సిరీస్‌లో భాగంగా HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌కు కొత్త 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో ఇదే ఫోన్‌ను 4GB + 64GB, 4GB + 128GB వేరియంట్లలో లాంచ్ చేసిన కంపెనీ, వినియోగదారుల నుంచి వచ్చిన మంచి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అధిక RAM కలిగిన కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్త 6GB + 128GB వేరియంట్ జూన్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఈ వేరియంట్ అసలు ధర రూ.16,999గా నిర్ణయించగా, ప్రారంభ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లతో రూ.14,999 ప్రత్యేక ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో 4GB + 128GB వేరియంట్ ప్రస్తుతం రూ.12,999 ధరకు మార్కెట్లో లభ్యమవుతోంది.

HMD Vibe 2 5Gలో 6.745 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్‌తో పాటు మెరుగైన వీయింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. పనితీరులో భాగంగా ఈ ఫోన్‌లో Unisoc T8200 6nm ప్రాసెసర్‌ను ఉపయోగించగా, గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను జత చేశారు.

స్టోరేజ్ పరంగా 64GB, 128GB ఎంపికలు అందుబాటులో ఉండగా, మైక్రోSD కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను గరిష్టంగా 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను కల్పించగా, 3.5mm ఆడియో జాక్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో సమకూర్చారు.

IP64 రేటింగ్‌తో వచ్చే HMD Vibe 2 5G దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB Type-C వంటి సదుపాయాలు ఉన్నాయి. పవర్ కోసం ఫోన్‌లో 6000mAh సామర్థ్యమైన బ్యాటరీని అమర్చగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే మద్దతు లభిస్తుంది.