రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
విదేశీ మదుపర్లకు ఊరట:
ప్రభుత్వ సెక్యూరిటీలపై LTCG పన్ను రద్దు
దిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ మదుపర్లు వరుసగా నిధులను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) చేసే పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల (LTCG) పన్నును రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా కేంద్రం స్పష్టం చేసింది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ మదుపర్లు సుమారు రూ.2.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2025 మొత్తం ఏడాదిలో వెనక్కి తీసుకున్న రూ.1.66 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నిధుల ఔట్‌ఫ్లో మరింత ఎక్కువగా నమోదైంది. జూన్ నెల ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే విదేశీ మదుపర్లు రూ.34 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. దీంతో రూపాయి మారక విలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించడంతో పాటు విదేశీ మూలధన ప్రవాహాన్ని మళ్లీ ఆకర్షించేందుకు కేంద్రం ఈ పన్ను సడలింపులను అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఏడాది దాటిన ఈక్విటీ, డెట్ పెట్టుబడులపై విదేశీ సంస్థాగత మదుపర్లు 12.5 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లిస్తున్నారు. ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై 20 శాతం విత్‌హోల్డ్ సుంకం కూడా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. తాజాగా ప్రకటించిన మినహాయింపు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే FIIలతో పాటు బ్యాంకు ఫర్ ఇంటర్నేషనల్ సేట్ఠలెమెంట్స్ (BIS)కు కూడా వర్తించనుంది. కొత్త నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన దీర్ఘకాలిక లాభాల పన్ను మినహాయింపుపై స్పష్టతనిచ్చేలా ఉన్నాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
విదేశీ పెట్టుబడుల కోసం RBI నుంచి అదనపు సడలింపులు
విదేశీ మదుపర్లను ఆకర్షించడంలో భాగంగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కూడా పలు చర్యలను ప్రకటించింది. 15, 30, 40 సంవత్సరాల గడువు గల ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడిదారులు ఎటువంటి పరిమితులు లేకుండా పెట్టుబడి పెట్టవచ్చని RBI స్పష్టం చేసింది. జనరల్ రూట్ ద్వారా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టే విదేశీ పెట్టుబడిదారులపై ఇప్పటివరకు అమల్లో ఉన్న స్వల్పకాలిక, కాన్సంట్రేషన్, వ్యక్తిగత సెక్యూరిటీ పరిమితులను తొలగించింది.
అలాగే ఎన్నారైలు, విదేశాల్లో నివసించే భారతీయులు లిస్టెడ్ ఈక్విటీల్లో పెట్టే పెట్టుబడులపై ఉన్న పరిమితులను కూడా RBI పెంచింది. దీంతో విదేశాల్లో నివసించే భారతీయులకు భారత ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం మరింత సులభతరమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, RBI కలిసి తీసుకుంటున్న ఈ చర్యలు రూపాయి స్థిరత్వం, మూలధన ప్రవాహం, దీర్ఘకాలిక ప్రభుత్వ రుణ వ్యయాలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







