రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
: ముకేశ్ అంబానీ
మదుపరులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘జియో ఐపీఓ’పై కీలక ప్రకటన వచ్చేసింది. ఈ ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు ఆమోదించింది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఈ ముసాయిదా పత్రాలను శుక్రవారమే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ముకేశ్ అంబానీ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జియో ఐపీఓ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది నాతో పాటు రిలయన్స్ కుటుంబానికి, కోట్లాది మంది వాటాదారులకు భావోద్వేగభరిత క్షణం. జియో ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను బోర్డు ఆమోదించింది. ఈ రోజే సెబీకి సమర్పిస్తాం. ఈ ఏడాది రిలయన్స్‌కు జియో ఐపీఓ అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది మా వాటాదారులకు గణనీయమైన విలువను అందించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నా. ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన సాంకేతిక సంస్థలను భారత్ నిర్మించగలదని జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుంది’’ అని ముకేశ్ అంబానీ వెల్లడించారు.
గతేడాది నిర్వహించిన రిలయన్స్ ఏజీఎం సందర్భంగా జియో ఐపీఓ గురించి ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. 2026కు తొలి అర్ధభాగంలోనే జియో ఐపీఓ ఉంటుందని అప్పట్లో తెలిపారు. అయితే, ఈ ఏడాదిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ క్షీణించడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల రిలయన్స్ ప్రధాన ఆదాయ వనరు అయిన పెట్రోకెమికల్ వ్యాపారంపై ప్రభావం పడడం వంటి పరిణామాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36- 40 వేల కోట్లు) మేర మార్కెట్ నుంచి సమీకరించనున్నారు.







