దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగించే వినియోగదారులకు భారత తపాలా శాఖ (India Post) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చేలా ’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ ప్రత్యేక సేవలకు కొత్త రేట్లను విడుదల చేసింది. అలాగే, ఏ వస్తువులను ‘లేఖలు’గా, ఏవాటిని ‘పార్శిల్’గా పరిగణించాలనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది.

తపాలా శాఖ వివరాల ప్రకారం, లేఖలుగా పరిగణించే వస్తువుల్లో అన్ని రకాల ఉత్తరాలు, ముద్రిత పత్రాలు, తిరిగి అమ్మే విలువ లేని బహుమతి వస్తువులు ఉంటాయి. స్వాగత కిట్‌లు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటి బ్యాంకింగ్, ఆర్థిక సేవలకు సంబంధించిన పత్రాలు కూడా లేఖల విభాగంలోకి వస్తాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేఖలుగా పరిగణించబడతాయి.

గరిష్టంగా 500 గ్రాముల వరకు ఉన్న రాఖీ కవర్లు, గ్రీటింగ్ కార్డులు (వాణిజ్య విక్రయాల కోసం పంపనివి) కూడా లేఖల కేటగిరీలోకి వస్తాయని తపాలా శాఖ స్పష్టం చేసింది. అయితే, లేఖల విభాగంలోకి రాని అన్ని రకాల వస్తువులు, వాణిజ్య ఉత్పత్తులు, వ్యాపార సరుకులు పార్శిల్ విభాగంలోకి వస్తాయని పేర్కొంది.

కొత్త స్పీడ్ పోస్ట్ రేట్ల ప్రకారం, రిటైల్ కస్టమర్ల కోసం ’24 స్పీడ్ పోస్ట్’ సేవలో బరువు, దూరాన్ని బట్టి ఒక్కో వస్తువుకు రూ. 38 నుంచి రూ. 186 వరకు చార్జీలు ఉంటాయి. 50 గ్రాముల వరకు స్థానిక డెలివరీకి రూ. 38, దేశవ్యాప్తంగా పంపే లేఖలకు రూ. 94 వసూలు చేయనున్నారు. ఈ రేట్లకు జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది.

51 నుంచి 250 గ్రాముల వరకు ఉన్న వస్తువులకు రూ. 118 నుంచి రూ. 154 వరకు, 251 నుంచి 500 గ్రాముల వరకు ఉన్న వస్తువులకు రూ. 140 నుంచి రూ. 186 వరకు చార్జీలు నిర్ణయించారు. ’48 స్పీడ్ పోస్ట్’ సేవలో బరువు, దూరాన్ని బట్టి ఒక్కో వస్తువుకు రూ. 61 నుంచి రూ. 121 వరకు రుసుము వసూలు చేయనున్నారు.

టోకు (బల్క్) వినియోగదారుల కోసం ఉత్తరాల విభాగంలో ప్రత్యేక ధరలను ప్రకటించారు. ’24 స్పీడ్ పోస్ట్’ బల్క్ బుకింగ్‌లలో ఒక్కో వస్తువుకు రూ. 38 నుంచి రూ. 100 వరకు, ’48 స్పీడ్ పోస్ట్’ బల్క్ బుకింగ్‌లలో ఒక్కో వస్తువుకు రూ. 48 నుంచి రూ. 72 వరకు రేట్లు ఉంటాయి.

ప్రస్తుతం ’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ ప్రత్యేక సేవలు దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల ద్వారా వరుసగా 24 గంటలు, 48 గంటల్లోపు పార్శిల్‌లు, పత్రాల డెలివరీని తపాలా శాఖ అందిస్తోంది.

కొత్త రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తువులు పంపే ముందు అవి లేఖల కేటగిరిలోకి వస్తాయా లేదా పార్శిల్ కేటగిరిలోకి వస్తాయా అనే విషయాన్ని వినియోగదారులు ముందుగానే నిర్ధారించుకోవాలని తపాలా శాఖ సూచించింది. ముఖ్యంగా బల్క్ బుకింగ్‌లు చేసే సంస్థలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు కొత్త ధరలను పరిశీలించి, తమ అవసరాలకు అనుగుణంగా సేవలను వినియోగించుకోవాల్సిందిగా సూచించింది.