రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు: చిత్తూరులోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించే ప్రతిపాదనపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్యాలయాన్ని చిత్తూరులోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి నేతృత్వంలో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది.
కటమంచి లాయర్స్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. కార్యాలయాన్ని తరలించే ప్రభుత్వ యత్నాలను వెంటనే నిలిపివేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ, గతంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని కూడా చిత్తూరులో నుంచి తిరుపతికి తరలించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అదే విధంగా ఎక్సైజ్ కమిషనరేట్‌ను తరలించేందుకు ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలను బలహీనపరచే చర్యలను ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు.
చిత్తూరు నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ తరలించకుండా చూస్తామని హామీ ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పుడు మౌనం వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాల తరలింపు అంశంపై ప్రజాప్రతినిధి తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయం చిత్తూరులో ఉండడం వల్ల జిల్లాలోని ప్రజలకు, వ్యాపార వర్గాలకు సౌకర్యంగా ఉంటుందని, తిరుపతికి తరలిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. చిత్తూరు అభివృద్ధికి కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను కాపాడుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తరలించే నిర్ణయాన్ని ప్రభుత్వం పునర్విచారించాలని, చిత్తూరులోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కార్యాలయాన్ని తరలించే యత్నాలు కొనసాగితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.













