రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు: పూతలపట్టు నియోజకవర్గంలో మహిళల రాజకీయ ప్రభావం మరింత బలపడింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఐదు జడ్పిటిసి స్థానాల్లో మూడు స్థానాలను మహిళలు ఏకగ్రీవంగా గెలుచుకుని తమ శక్తి సామర్థ్యాలను చాటుకున్నారు. స్థానికంగా వీరిని మహిళా మహా రాణులుగా అభివర్ణిస్తున్నారు.
పూతలపట్టు జడ్పిటిసి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శైలజ తేజోమూర్తి విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. విద్యా సేవల ద్వారా ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకున్న ఆమెకు ఈ ఎన్నికతో ప్రజాప్రతినిధిగా సేవ చేసే అవకాశం లభించింది.
బంగారు పాల్యం జడ్పిటిసి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సుచిత్ర జయప్రకాశ్ నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు. ఆమె కుటుంబ సభ్యులు గతంలో అనేక రాజకీయ పదవులు నిర్వహించగా, ఆ అనుభవం, పరిచయాలు ఇప్పుడు సుచిత్రకు బలంగా నిలుస్తాయని స్థానికులు భావిస్తున్నారు.
యాదమరి జడ్పిటిసి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మొరార్జీ యశోదమ్మ కూడా ప్రజల మధ్య నిత్యం కలిసిమెలిసి ఉండే నాయకురాలిగా పేరుపొందారు. గతంలో రాజకీయ పదవులు నిర్వహించిన అనుభవంతో ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా ఆమెను స్థానికులు పేర్కొంటున్నారు.
నేటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా పోటీపడుతూ మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఈ ముగ్గురు మహిళా జడ్పిటిసి సభ్యురాలు కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక మహిళలు, ప్రజలు కొత్తగా ఎన్నికైన సభ్యురాళ్లను ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు మహిళల భద్రత, స్వయం ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై కూడా ఇవే నాయకులు కృషి చేస్తారనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది.
కూటమి ప్రభుత్వం మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో, పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలకు లభించిన ఈ ప్రాతినిధ్యం స్థానిక మహిళల్లో ఉత్సాహాన్ని నింపింది. రిజర్వేషన్ వల్లే తమలాంటి మహిళలకు నాయకత్వ అవకాశాలు లభిస్తున్నాయని భావిస్తూ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













