రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్ యువకుడిని ఇష్టానుసారంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగ జాతర వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న చిన్నపాటి వివాదం పోలీసు దౌర్జన్యానికి దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, బీఎన్‌ఆర్‌పేటలో మంగళ, బుధవారం గంగ జాతర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఓ వర్గానికి చెందిన వారు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లలో రాము అనే వ్యక్తి ఫొటోను చిన్న పరిమాణంలో, చివర భాగంలో ముద్రించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాము, తన ఫొటోను చిన్నదిగా కింద భాగంలో ముద్రించడం తగదని మంగళవారం వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో బ్యానర్‌ను చింపేసినట్లు సమాచారం.
ఈ సంఘటనపై ఆ వర్గం వారు అదే రోజు బీఎన్‌ఆర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులోని విషయాలను, వివాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించకుండానే హెడ్‌కానిస్టేబుల్ కిరణ్ చర్యలకు దిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
వారి కథనం ప్రకారం, హెడ్‌కానిస్టేబుల్ కిరణ్ మంగళవారం రాము ఇంటికి వెళ్లి, అక్కడే అతనిని పట్టుకుని ఇంటి నుంచి లాగుతూ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. అనంతరం స్టేషన్‌లో రామును ఇష్టానుసారంగా కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకారణంగా, విచక్షణారహితంగా కొట్టడం అన్యాయమని రాము కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు స్టేషన్‌కు చేరుకుని హెడ్‌కానిస్టేబుల్ కిరణ్‌తో పాటు అక్కడి పోలీసు సిబ్బందిని నిలదీశారు.
గ్రామస్థుల ఆందోళన, పెద్దల జోక్యంతో రామును మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ నుంచి విడుదల చేసినట్లు సమాచారం. అనంతరం రాము బుధవారం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తనపై జరిగిన దౌర్జన్యాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చాడు.
ఈ విషయంపై వార్తలు వెలుగులోకి రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించింది. ప్రాథమిక స్థాయిలో విషయాలను పరిశీలించిన అనంతరం హెడ్‌కానిస్టేబుల్ కిరణ్‌ను వీఆర్‌కు పంపినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.













