రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పారిశ్రామిక రంగం వేగంగా విస్తరిస్తోంది. నూతనంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పట్టణంతో పాటు గ్రామాల్లోనూ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు మంజూరు చేయగా, ప్రస్తుతం అనేక పనులు అమలు దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కుప్పం పరిసరాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే అవకాశంగా భావించిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములు, మేత పొరంబోకు, గుట్టలు, అటవీ ప్రాంతాలపై కన్నేశారు. ఈ భూములను ముందుగా ఆక్రమించుకుని, తరువాత రీ సర్వే సమయంలో తమ పేర్లపై ఎక్కించుకోవాలనే పన్నాగాలు పన్నుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ యంత్రాంగంలోని కొందరు అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కబ్జా దారులకు ఎదురులేకుండా పోతున్న పరిస్థితి నెలకొంది. గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడే అధికారులు రంగంలోకి దిగుతూ, అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా కుప్పం మండలం క్రిష్ణదాసనపల్లె పంచాయతీ వరమనూరు వద్ద ఇదే తరహాలో ఆక్రమణలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. కబ్జా జరుగుతోన్న విషయం నెల రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దారు కన్నా తక్కువ హోదా ఉన్న అధికారికి తెలిసినా, ఆయన మౌనంగా ఉండిపోయారని ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి సహకారంతోనే అక్రమార్కులు సంబంధిత భూమిలోకి ప్రవేశించారనే మాటలు వినిపిస్తున్నాయి.
చివరకు ఈ వ్యవహారం తహసీల్దారు దృష్టికి వెళ్లడంతో గురువారం ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. వరమనూరు వద్ద ‘జరుగు హిల్స్’ వర్గీకరణలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరా విలువ సుమారు రూ.25 లక్షలు. ఇందులో 10 ఎకరాలపై ఒకరి కన్ను పడగా, ఆయన తహసీల్దారు కార్యాలయంలోని ఓ అధికారిని సంప్రదించి పట్టా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
‘మీరు ముందు ఆ స్థలాన్ని దున్నుకుని ఏదో ఒక మొక్కలు నాటండి’
అని సదరు అధికారి సూచించినట్లు తెలుస్తోంది. దాంతో కబ్జాదారు వెంటనే రంగంలోకి దిగి భూమిని చదును చేసే పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 6 ఎకరాలను చదును చేయడంతో పాటు అక్కడ నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. ఓ చిన్న గదిని నిర్మించి, దశాబ్దాలుగా తాము ఇక్కడే ఉంటున్నామని నమ్మించే ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికులు ఈ విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఆక్రమణలను నిలిపివేశారు. కాగా రెండు రోజుల క్రితమే కబ్జాకు సహకరించిన అధికారి స్థలం వద్దకు వెళ్లి రావడం గమనార్హమని గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇక గుడుపల్లె మండలం మల్లప్పకొండ అభివృద్ధి కోసం గతంలో అటవీ శాఖ భూమిని తీసుకున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని చూపించాలని అటవీ శాఖ, రెవెన్యూ శాఖను కోరింది. అక్కడ మొక్కల పెంపకం చేపడతామని అటవీ శాఖ తెలిపింది. ఈ ప్రతిపాదన అమలు దశలో ఉండగానే కబ్జాదారు రంగంలోకి దిగినట్లు సమాచారం.
సర్వే శాఖలోని ఓ అధికారి ఇచ్చిన సమాచారం ఆధారంగా సంబంధిత స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించాలని కబ్జాదారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తహసీల్దారు కార్యాలయంలోని అధికారిని ఆశ్రయించగా, ఆయన అభయహస్తం ఇవ్వడంతో సుమారు రూ.2.50 కోట్ల విలువైన స్థలాన్ని కాజేయాలనే యత్నం జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.













