రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రముఖ సంగీత విద్వాంసులు మృతి చెందారు. ఆలయాల్లో కచేరీలు నిర్వహిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఈ కళాకారులు, మరోసారి సంగీత సేవ కోసం బయలుదేరిన సమయంలో బస్సు ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో సంగీత వర్గాల్లో విషాదం నెలకొంది.
తిరుపతి గ్రామీణ మండలం ముత్యాలరెడ్డిపల్లికి చెందిన విశ్రాంత సీసఫ్ ఉద్యోగి, తబలా విద్వాంసుడు వేలూరు నాగరాజు శెట్టి (57), రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాళేపల్లికి చెందిన టీటీడీ ఉద్యోగి, వయోలిన్ విద్వాంసుడు చక్రవర్తి (42) శుక్రవారం నగరి మండలం సత్రవాడలో టీటీడీ కు అనుబంధంగా ఉన్న కరి వరదరాజ స్వామి ఆలయంలో కచేరీకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
వీరిద్దరూ కలిసి ఆలయ కచేరీల్లో పాల్గొంటూ, ఒకరి చేతిలో వయోలిన్, మరొకరి చేతిలో తబలాతో సమన్వయంగా వాయిస్తూ శ్రోతలను మైమరపించేలా సంగీతాన్ని వినిపించేవారని స్థానికులు చెబుతున్నారు. ఆలయాల్లో నిర్వహించిన కచేరీలకు అనేక సత్కారాలు, ప్రశంసలు అందుకున్న ఈ కళాకారులు, శుక్రవారం కూడా అదే ఉత్సాహంతో సంగీత సేవకు బయలుదేరినట్లు సమాచారం.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పూడి క్రాస్ వద్ద సత్యవేడు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను అతి వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు వేలూరు నాగరాజు శెట్టి, చక్రవర్తి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు వేగం అధికంగా ఉండటంతో ప్రమాదం తీవ్రంగా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
సంగీత సేవ కోసం ఆలయ కచేరీకి బయలుదేరిన సమయంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో, వారి కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. ఆలయాల్లో వీరి సంగీతాన్ని ఆస్వాదించిన భక్తులు, అభిమానులు ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంగీత వర్గాలు కూడా ఈ దుర్ఘటనను తీవ్రంగా విచారిస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వడమాలపేట పోలీస్ స్టేషన్ ఎస్సై హరీష్ తెలిపారు.













