రాయలసీమ న్యూస్, చిత్తూరు:
మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి స్పష్టం
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని పెద్దపంజాణి సత్రంలో నూతనంగా నిర్మించిన నూరుల్ హుదా జామియా మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు పెద్దలు, మండల మైనారిటీ సోదరులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ప్రారంభోత్సవం సందర్భంగా మసీదులో ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

తరువాత మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని గజమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మసీదు నిర్మాణానికి సహకరించిన దాతలను కూడా ఈ సందర్భంగా గుర్తించి అభినందించారు.
కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక సాధికారతతో పాటు మతపరమైన సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వివరించారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదుకుంటూ, మతసామరస్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. మైనారిటీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలతో సమన్వయం పెంచుకుంటూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.
నూరుల్ హుదా జామియా మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, మత పెద్దలు, కూటమి నాయకులు ఖాజాపీర్, ముబారక్, బాబాజాన్, మాబాషా, నదీం, జిలాని తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై ప్రార్థనలు చేశారు.













