పలమనేరు: ఎన్నికలకు ముందుమాట ఇచ్చినట్టుగానే అభివృద్ధి చేసి చూపామని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. పలమనేరు పట్టణంలోని గొబ్బిళ్ళకోటూరు, టెర్రకోట కాలనీ, గంటావూరు ఇందిరమ్మ, వైయస్సార్, బీసీ కాలనీల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావుతో కలిసి శనివారం పర్యటించారు.

ఈ సందర్భంగా సుమారు 9 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. గంటావూరు కాలనీ వాసులను ఉద్దేశించి ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని తెలిపారు. తమకు ఓట్లు వేసినా, వేయకపోయినా అభివృద్ధిని మాత్రం చేసి చూపుతామని పేర్కొన్నారు.

రోడ్లు, డ్రైన్లు, విద్యుచ్చక్తి, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను అందించేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. అభివృద్ధి చేసే వారినే ప్రజలు ఆదరించి పట్టం కట్టాలని, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ కార్యక్రమాలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అమరనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆర్డిఎస్ఎస్ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంలాంటిదని, దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యమని, అందులో భాగంగా 24 గంటలు త్రీఫేస్ కరెంటును ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు చేరువ చేస్తోందని తెలిపారు. దీంతో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు.

వినాయక చవితికి మట్టి వినాయకులనే పూజిద్దాం: ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయకులను పూజించాలని ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. టెర్రకోట కళాకారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యేకు అందజేశారు.

వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని, అలాగే వినాయక చవితి సందర్భంగా చెత్తను ఉచితంగా తరలించే కార్యక్రమాలను చేపడుతోందని ఆయన తెలియజేశారు. ఆహ్లాదకరమైన, శుభ్రమైన వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోవాలని అమరనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాలలో కూటమి నాయకులు ఆర్ వి బాలాజీ, రాజన్న, సుబ్రహ్మణ్యం గౌడు, కుట్టీ, గిరిబాబు, శ్రీధర్, ఖాజా, నాగరాజు, చాంద్ భాషా, మదన్, చెంగప్ప, కృష్ణమూర్తి గౌడు తదితరులు పాల్గొన్నారు.