రాయలసీమ న్యూస్, చిత్తూరు:
గాల్లో కలుస్తున్న ప్రాణాలు… పీఎం రాహత్ పథకం ప్రయోజనం లేకుండాపోతోంది
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు–బెంగుళూరు హైవే విస్తరణ తర్వాత ప్రమాదాల సంఖ్య మరింతగా అధికమైంది. ప్రతిరోజూ జరిగే ప్రమాదాల్లో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినా, ముందుగా నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని ఆస్పత్రులు స్పష్టంగా చెబుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు, వారం రోజుల వరకూ వైద్య ఖర్చులు భరించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలో ఈ పథకం అమలు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదని స్థానికులు చెబుతున్నారు.
జిల్లాలోని 9 నెట్‌వర్క్ ఆస్పత్రులకు (ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించే ప్రైవేట్ ఆస్పత్రులు) పీఎం రాహత్ పథకం వర్తించేలా అర్హత కల్పించారు. అయితే వీటిలో కుప్పం పీఈఎస్ ఆస్పత్రి మినహా మిగిలిన ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడేంత ట్రామా కేర్ సౌకర్యాలు లేవని, అవసరమైన వైద్య నిపుణులు కూడా అందుబాటులో లేరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్యుల అభిప్రాయం ప్రకారం రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే, ముఖ్యంగా గోల్డెన్ అవర్ లోపల సరైన వైద్యం అందితే సుమారు 60 శాతం మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. కానీ జిల్లాలో తగిన ట్రామా కేర్ సౌకర్యాలు లేకపోవడం, బాధితులను ఆలస్యంగా ఆస్పత్రులకు తరలించడం వల్ల చాలామంది మార్గమధ్యలోనే లేదా ఆలస్యంగా చేరి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని చోట్ల ట్రామా కేర్ పేరుతో మొక్కుబడి వైద్యం మాత్రమే అందుతున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు.
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి రోడ్డు ప్రమాద బాధితులను తీసుకొస్తే, మెరుగైన వైద్యం పేరిట కేసుల సింహభాగాన్ని సీఎంసీ, స్విమ్స్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి చేరుకోవాలంటే సుమారు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్ యూనిట్ ఉన్నప్పటికీ, కీలకమైన న్యూరో సర్జన్ వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని, యూనిట్‌కు పూర్తిస్థాయి వసతులు లేవని ఆరోపణలు ఉన్నాయి.
మన రాష్ట్ర పరిధిలోని చీలాపల్లి సీఎంసీ, అలాగే జిల్లాకు సమీపంలోని రాణిపేట, వేలూరు సీఎంసీల్లో (తమిళనాడు) ట్రామా కేర్ సేవలు ఉన్నప్పటికీ, ఈ ఆస్పత్రులకు పీఎం రాహత్ పథకం వర్తించడం లేదు. దీంతో అక్కడ చికిత్స పొందాలంటే నగదు చెల్లించాల్సి రావడంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి చిత్తూరు నగరం నుంచి చీలాపల్లి సీఎంసీకి తక్కువ సమయంలో, హైవే మార్గంలోనే చేరుకునే అవకాశం ఉంది.
జిల్లాలోని 9 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కుప్పం పీఈఎస్, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తప్ప మిగిలిన చోట ట్రామా కేర్ యూనిట్లు లేవు. ఈ కారణంగా అత్యధిక శాతం క్షతగాత్రులను సీఎంసీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు సమీపంలోని చీలాపల్లి సీఎంసీకి పీఎం రాహత్ పథకాన్ని వర్తింపజేసేలా జిల్లా అధికారులు చొరవ చూపితే, రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.













