రాయలసీమ న్యూస్, చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన పల్లె పండగల ద్వారా జిల్లాలో 25 మండలాలు లబ్ధి పొందాయి. ఆ కార్యక్రమాల ఫలితంగా మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కలగడమే కాకుండా పలు అభివృద్ధి పనులు అమలు అయ్యాయి. ఆ రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వినియోగించింది.
పల్లె పండగ 3.0లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనులు చేపట్టనున్నాయి. వీటిని వీబీ జీ రామ్జీ పథకం కింద అమలు చేస్తున్నప్పటికీ నిధుల వినియోగంలో 60:40 నిష్పత్తి పాటించనున్నారు. జిల్లాలోని పుంగనూరు, మదనపల్లె, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో సుమారు 500 పనులకు రూ.36 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు.
పల్లె పండగ 3.0 అమలులో గ్రామాల్లో సిమెంటు రహదారుల నిర్మాణంపైనే ప్రధాన దృష్టి సారించనున్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి కొత్తగా దారులు వేయడం, ఇప్పటికే ఉన్న మట్టి, గ్రావెల్ రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయడం ఈ దశలో ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. వీటితో పాటు పల్లె పండగ 2.0లో గుర్తించిన పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రజా వినియోగానికి అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం కింద పనుల గుర్తింపు, నిధుల కేటాయింపు అధికారికంగా పూర్తయ్యాయి. పుంగనూరు నియోజకవర్గంలో 93 పనులకు రూ.5.16 కోట్లు మంజూరు చేశారు. పుంగనూరు మండలంలోని రాగానిపల్లె పంచాయతీలో ఈ పథకం కింద పనులను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు నిధుల కేటాయింపులు జరిగాయి.
జిల్లా మండలాల్లో ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎన్ని గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల రహదారి అవసరమో లెక్కలు తీస్తున్నారు. ఎక్కువ దూరం రహదారి నిర్మించాల్సి వస్తే దశలవారీగా పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిధులతో వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం కలగనుందని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం దోహదం చేయనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.













