రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు: శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన పుష్పపల్లకి సేవకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్సవాల సందర్భంగా స్వామి వారికి చందన అలంకారం చేసి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పూజల మధ్య స్వామి, అమ్మవార్లను ఆలయ అర్చకులు విదేశీ సుగంధ పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకిపై ఆశీనులను చేశారు. పల్లకి సేవ ప్రారంభానికి ముందు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు హారతులు ఇచ్చారు.
పుష్పపల్లకిలో ఊరేగుతున్న వినాయక స్వామిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోయి, శుభఫలితాలు కలుగుతాయని ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. పల్లకి ఊరేగింపును వీక్షించేందుకు కాణిపాకం పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి.
స్వామివారి పుష్పపల్లకి సేవలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, హుండీలలో కానుకలు సమర్పించారు. దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈ.ఓ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మరిన్ని ఉత్సవాలు, సేవలకు సంబంధించి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.













