రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు, : జిల్లాలో జరుగుతున్న రీ–సర్వే పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మండల సర్వేయర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మండల సర్వేయర్లతో రీ–సర్వే పనులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 4, 5, 6వ దశల రీ–సర్వే పనుల పురోగతి, షేప్ఫైల్ సవరణలు, GTపై ఈ–కేవైసీ, 7వ దశ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలను మండలాల వారీగా సమీక్షించారు. ప్రతి మండలంలో పనుల స్థితిగతులను వివరంగా తెలుసుకున్నారు.
ప్రతి గ్రామంలో జరుగుతున్న రీ–సర్వే పనులపై మండల సర్వేయర్లకు పూర్తి అవగాహన ఉండాలని, క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. రైతులకు ముందుగా నోటీసులు అందజేసి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

SOP ప్రకారం GT, VR, వెక్టరైజేషన్ తదితర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న డేటా ఎంట్రీలను వెంటనే పూర్తి చేసి, తదుపరి దశలకు పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రీ–సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ మండల సర్వేయర్లను ఆదేశించారు. పనుల అమలులో తలెత్తే సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు.
ప్రతి నెలా మండల సర్వేయర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారానికొకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురోగతిని సమీక్షించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.













