రాయలసీమ న్యూస్, చిత్తూరు:
రూపాయికి మూడు రెట్లు ఇస్తామని నమ్మబలికి రూ.15 లక్షల మోసం
రూపాయికి మూడు రెట్ల నగదు ఇస్తామని ఆశపెట్టి రూ.15 లక్షలు తీసుకుని ఓ ముఠా పరారైన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మంగళవారం ఈ విషయం బయటకు వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తడ మండలం వెండ్లూరుపాడు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి అలియాస్ వేణు హార్వెస్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అతనికి తిరుపతి జీవకోనకు చెందిన గుణశేఖర్, చిల్లకూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, మరో ముగ్గురితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారు రవిచంద్రారెడ్డికి పెట్టుబడి పెడితే లక్ష రూపాయికి మూడు లక్షలు చెల్లిస్తామని చెప్పి నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు.
వారి మాటలకు లోనైన రవిచంద్రారెడ్డి అత్యాశతో రూ.15 లక్షలు సమకూర్చుకుని సోమవారం రాత్రి అంజిమేడు సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న దీప్ దాబా వద్దకు వెళ్లాడు. ముందుగా చెప్పినట్లే రెండు కార్లలో అక్కడికి చేరుకున్న నిందితులు అతన్ని ఒక ఇన్నోవా కారులో కూర్చోబెట్టుకుని తిరుపతి వైపు బయల్దేరారు. ఆర్.మల్లవరం సమీపానికి చేరుకున్న తర్వాత రవిచంద్రారెడ్డి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్, బంగారు నగలను లాక్కొని కారులో నుంచి దింపేసి అక్కడి నుంచి వేగంగా పారిపోయారు.
అనుకోని పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన రవిచంద్రారెడ్డి మంగళవారం ఉదయం ఏర్పేడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ శ్రీకాంత్ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మోసంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న గుణశేఖర్, శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పరారైన వారిలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు ఉన్నారని బాధితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
జిల్లాలో సంచలనం రేపిన ఈ ఘటనపై ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతి క్రైం ఏఎస్పీ, రేణిగుంట డీఎస్పీ, పలువురు సీఐలతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. బాధితుడిని విచారించిన అధికారులు అతని ప్రవర్తనలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు గమనించినట్టు తెలుస్తోంది. రవిచంద్రారెడ్డికి ముఠా సభ్యులతో చాలా ఏళ్ల క్రితమే పరిచయం ఉన్నట్టు కూడా దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం.
ముఠాతో రవిచంద్రారెడ్డి సంబంధం ఏంటి? ఇరువురి మధ్య గతంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి? అత్యాశతోనే అతను ఈ ఒప్పందానికి ఒడిగట్టాడా? లేక ఎలాంటి బెదిరింపుల నేపథ్యంలో వచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు చుట్టూ ఉన్న అనేక అనుమానాస్పద అంశాలను వెలికితీసేందుకు విచారణ బృందం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది.













