రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు: ప్రపంచ ఫార్మసిస్ట్ డేను పురస్కరించుకుని చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ బంగ్లా సమీపం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు నినాదాలతో ర్యాలీగా సాగారు.
ఫార్మసిస్ట్‌ల ప్రాధాన్యత, ప్రజారోగ్యంలో వారి పాత్రపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు వివిధ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మందుల సరైన వినియోగం, రోగుల భద్రత, ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్ట్‌ల బాధ్యతలపై ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్స్ డి. జ్యోతిశ్వరి, సాయి రాజేష్ మాట్లాడుతూ వైద్యరంగంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు చికిత్స అందించడంతో పాటు, రోగులకు అవసరమైన మందులను సరైన విధానంలో అందించడం, వాటి వినియోగంపై అవగాహన కల్పించడం ఫార్మసిస్టుల ముఖ్య బాధ్యతలని తెలిపారు.
వ్యాధుల నియంత్రణలో మందులు ఎంతో కీలకమని, ఈ క్రమంలో ఫార్మసిస్టుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఆరోగ్య వ్యవస్థ సజావుగా నడవాలంటే ఫార్మసిస్ట్‌ల పాత్ర మరింతగా గుర్తింపు పొందాలని సూచించారు. ఫార్మసిస్టుల సేవలను సమాజం గుర్తించి గౌరవించాలని కోరారు.
ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు సహకరించిన శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేతలు రావూరి శ్రీనివాసులు, రావూరి వెంకటస్వామికి, అలాగే పోలీసు శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీ సాఫీగా, శాంతియుతంగా సాగేందుకు అందించిన సహకారాన్ని ప్రశంసించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఫార్మసిస్ట్‌ల సేవలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.













