గంజాం జిల్లా ఛత్రపురం ఠాణా పరిధిలో 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ విందు కోసం రూ.30 ఇవ్వమని తమ్ముడితో జరిగిన చిన్న గొడవ అనంతరం ఆమె పెరట్లోని నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పునకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల సమాచారం ప్రకారం, మృతురాలి తండ్రి కొంతకాలం క్రితమే మృతిచెందాడు. తల్లి హైదరాబాద్‌లో వలస కార్మికురాలిగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలిక, ఆమె ఎనిమిదేళ్ల తమ్ముడు కలిసి ఛత్రపురం ఠాణా పరిధిలోని ఒక ప్రాంతంలో పెద్ద తాతయ్య ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక తమ్ముడితో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగింది.

ఓ వివాహ విందుకు వెళ్లేందుకు రూ.30 ఇవ్వాలని ఆమె తమ్ముడిని అడగగా, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ తర్వాత బాలిక ఇంటి పెరట్లో నిర్మాణంలో ఉన్న గదివద్దకు వెళ్లింది. కొద్దిసేపటి తరువాత ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.

రాత్రి ఇంటికి వచ్చిన పెద్దలు బాలిక ఎక్కడ ఉందని తమ్ముడిని ప్రశ్నించగా, ఆమె బయటికి వెళ్లే ముందు తనతో

నీకు సర్‌ప్రైజ్‌ ఇస్తాను

అని చెప్పి పెరట్లోకి వెళ్లిందని బాలుడు వారికి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు పెరట్లోకి వెళ్లి చూడగా, నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పునకు ఉరేసుకున్న స్థితిలో బాలిక కనిపించింది.

తక్షణమే ఆమెను హుటాహుటిన ఛత్రపురంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న ఛత్రపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్న కారణంతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, బాలిక మానసిక స్థితి తదితర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.