బ్రెజిల్‌లో రోప్‌ జంపింగ్‌ వినోద కార్యక్రమం విషాదంగా మారింది. తాడును అమర్చకుండానే వంతెనపై నుంచి ఒక యువతిని కిందకు నెట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సావో పాలో రాష్ట్రంలోని లిమెయిరా, కోర్డెయిరోపోలిస్ పట్టణాల సరిహద్దులో ఉన్న పొంటే దొ ఎస్కెలెటో వద్ద ఈ ప్రమాదం జరిగింది. 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్‌ను వాడుకలో లేని ఈ వంతెన అంచుకు తీసుకెళ్లి కిందకు నెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వీకెండ్‌లో వైరల్‌ అయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి ఆమె కిందపడింది.

అత్యవసర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే సమయానికి మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెయిటాస్ ఇప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు మరుసటి రోజే నిర్వహించారు.

స్థానిక వార్తా వెబ్‌సైట్ ‘గ్లోబో’ ప్రకారం, అరెస్ట్‌ అయిన ముగ్గురు వ్యక్తులు హత్య ఉద్దేశంతోనే యువతిని వదిలేశారా, లేక అలాంటి ఉద్దేశం లేకపోయినా ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీడియోలో తెల్లటి హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు యువతి చేతులను పట్టుకుని ఉండగా, మరో వ్యక్తి ఆమె కాళ్లను పట్టుకుని కనిపిస్తున్నారు. యువతిని వంతెనపై నుంచి నెట్టేసిన వెంటనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి, ఆమెకు తాడును అమర్చాలని సిబ్బందిని హెచ్చరిస్తూ అరుస్తున్న శబ్దం కూడా వీడియోలో వినిపిస్తోంది.

అరెస్ట్‌ అయిన ముగ్గురు వ్యక్తులు తాడుకు అనుసంధానించిన హార్నెస్‌లు ధరించి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. అయితే యువతికి మాత్రం అలాంటి రక్షణ పరికరాలు అమర్చలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

‘స్కెలెటన్ బ్రిడ్జ్’గా పిలిచే ఈ వంతెన ఎన్నో ఏళ్లుగా వాడుకలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. దర్యాప్తులో అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రెజిల్ ఫెడరల్ ఆస్సెట్స్ కార్యదర్శి వెల్లడించారు.

వంతెన నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని లిమెయిరా నగర పాలక సంస్థ వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతానికి బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోవాలని తాము ఇప్పటికే పలుమార్లు కోరినట్లు కూడా నగర పాలక సంస్థ తెలిపింది.

రోప్‌ జంపింగ్‌ అనేది బంజీ జంపింగ్‌కు భిన్నమైన సాహస క్రీడ. ఇందులో తక్కువ సాగుదల కలిగిన తాళ్లను ఉపయోగిస్తారు. కిందకు పడే వేగాన్ని అవి అడ్డంగా పెండ్యులమ్‌ వంటి కదలికగా మారుస్తాయి. బంజీ జంపింగ్‌లో మాత్రం సాగే గుణం ఉన్న రబ్బరు తాడును ఉపయోగించడం వల్ల పైకి, కిందికి ఊగే కదలిక ఏర్పడుతుంది.

ఈ రోప్‌ జంపింగ్‌ కార్యకలాపాలను నిర్వహించిన వారు ఓ ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షకులని స్థానిక అధికారులు తెలిపారు. అయితే కొన్ని స్థానిక మీడియా కథనాలు మాత్రం వారు అధికారిక సంస్థకు చెందినవారు కాదని, అనధికారికంగా ఈ క్రీడను నిర్వహించే బృందాలకు చెందినవారై ఉండొచ్చని పేర్కొన్నాయి.