రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును విచారించిన పోలీసులు, పాఠాలు చెప్పే గురువునే ఆమె స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం, ఈ ఇద్దరు విద్యార్థులు గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ వ్యసనాలు, జల్సాల కోసం అవసరమైన డబ్బు కొరత కారణంగా, తమ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని నిందితులు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 11న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో స్కూల్ ముగించుకుని రూపారెడ్డి ఇంటికి బయలుదేరారు. ఆమె ఇంటికి చేరుకునేలోపే నిందితులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. రూపారెడ్డి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో, నిందితులు ఇప్పటికే వంటగదిలో దాక్కున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
ఇంట్లోకి వెళ్లిన రూపారెడ్డి ఫ్రెష్ అయి బెడ్రూమ్‌లోకి వెళ్లగానే, నిందితులు వెనక నుంచి దాడి చేశారు. కత్తితో వరుసగా దాడి చేసి, ఏకంగా 27 సార్లు పొడిచి రూపారెడ్డిని అక్కడికక్కడే చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య అనంతరం రూపారెడ్డి హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల నగదును నిందితులు అపహరించారు. సంఘటన స్థలం నుంచి పారిపోతూ, సీసీటీవీ కెమెరాల్లో కనిపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తరువాత ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకుని విచ్చలవిడిగా జల్సాలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇతర క్లూస్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి, చివరికి ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా, హత్య, చోరీ, తరువాత హైదరాబాద్ లో చేసిన జల్సాల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
చదువు చెప్పి, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువునే, డబ్బుల కోసం ఆమె స్కూల్‌లోనే చదువుతున్న ఇద్దరు విద్యార్థులు దారుణంగా హత్య చేసిన ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గంజాయి మత్తు, చెడు వ్యసనాలు యువతను ఎంతటి దారుణాలకు గురిచేస్తున్నాయో ఈ కేసు మరోసారి స్పష్టంచేసిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.






