విజయవాడలో సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్‌ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజుకు సన్నిహితుడైన సురేష్.. సిట్‌ అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో సురేష్‌ను సిట్‌ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. సురేష్ వద్ద నుండి కీలక సమాచారం రాబట్టే దిశగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సాయికృష్ణ లాక్అప్ డెత్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు సిట్‌ ఇప్పటికే గుర్తించింది.

మరోవైపు.. ఈ ఘటనపై అనేక కోణాల్లో విచారణ కొనసాగిస్తున్న సిట్‌.. కేసులో కీలకంగా భావిస్తున్న పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిట్, అనుమానితుల కోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కూడా బృందాలను పంపింది. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అశోక్, నాని ఇళ్లకు వెళ్లి సిట్ సిబ్బంది నోటీసులు అందజేసినట్లు సమాచారం. అదేవిధంగా, పరారీలో ఉన్న నిందితులు తమ కుటుంబ సభ్యులతో వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని సిట్ అనుమానిస్తోంది. ఈ డిజిటల్ ఆధారాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.

విజయలక్ష్మి న్యాయ పోరాటం.. 
సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్‌డెత్‌ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యర్థిస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.