విజయవాడ పటమటకు చెందిన యువతి నాగసౌమ్య డ్రగ్స్ కేసులో అరెస్టైంది. జైల్లో ఉన్న తన ప్రియుడు కాశీవర్ధన్‌కు బెయిల్ కోసం డబ్బులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె డ్రగ్స్ క్యారియర్‌గా మారినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ మాదక ద్రవ్యాన్ని తీసుకొస్తుండగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆమెను పట్టుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, నాగసౌమ్యకు మాదక ద్రవ్యాల అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో చిత్తూరులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం అవసరమైన నగదు లేకపోవడంతో, డ్రగ్స్ రవాణా ద్వారా కమిషన్ సంపాదించాలని నాగసౌమ్య నిర్ణయించినట్లు దర్యాప్తులో బయటపడింది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు బషీర్, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తే రూ.50 వేల కమిషన్ ఇస్తానని నాగసౌమ్యను ప్రలోభపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న నాగసౌమ్య బెంగళూరులోని యలహంకకు వెళ్లి, అక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 110 గ్రాముల ఎండీఎంఏను స్వీకరించింది.

తర్వాత బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది. ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలోని బృందాలు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిఘా ఏర్పాటు చేశాయి. రైలులో పోలీసుల తనిఖీలను గమనించిన నాగసౌమ్య, ఈ విషయాన్ని బషీర్‌కు ఫోన్ ద్వారా తెలియజేయడంతో అతడు స్టేషన్ నుంచి పరారయ్యాడు.

ఆ తర్వాత పోలీసులు నాగసౌమ్యను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచిన డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బషీర్‌ను కూడా బుధవారం విజయవాడలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగసౌమ్య, బషీర్‌లపై మాదక ద్రవ్యాల చట్టం కింద చర్యలు కొనసాగుతున్నాయని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.