నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి

సీఎం బాబు, మంత్రి లోకేష్ సీరియస్‌..

గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబుకాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్‌ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. మోటార్‌ తొలగించాలని స్థానిక 21వ డివిజన్‌ తెదేపా కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి, తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్‌ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడిరోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా.. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశామని నగరంపాలెం సీఐ సత్యనారాయణ తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మూర్తిపై సస్పెన్షన్‌ వేటు..

మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 21వ డివిజన్‌ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామన్నారు.

సీఎం, మంత్రి లోకేష్ సీరియస్‌..

గుంటూరులో మహిళను వివస్ర్తను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలకు హోం మంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించారాదని స్పష్టం చేశారు. నేరస్థుల్ని నేరస్థులుగానే చూడాలి తప్ప పార్టీల పరంగా చూడరాదని తేల్చి చెప్పారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉండాలని హోం మంత్రి ఆదేశించారు.