రాయలసీమ న్యూస్, డివోషనల్ డెస్క్: చాలా మంది కష్టపడి పనిచేసి మంచి ఆదాయం సంపాదించినా, అభివృద్ధి విషయంలో ముందుకు సాగలేక ఇబ్బందులు పడుతున్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బయటికి అన్నీ సవ్యంగా ఉన్నట్టే కనిపించినా, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబ కలహాలు తరచూ వేధిస్తుంటాయని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో కొన్ని వస్తువులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలంటూ పండితులు సూచిస్తున్నారు.
హిందువులు ఆచారాలు, పూజలు, నమ్మకాల విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నో పూజలు చేసినా, ఎన్నో దేవాలయాలు దర్శించినా, కొందరు మాత్రం అభివృద్ధి విషయంలో వెనుకబడిపోతున్నారని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అలాంటి వారి ఇళ్లలో పగిలిన విగ్రహాలు, చినిగిన దేవుడి పటాలు ఉండే అవకాశముందని, ఇవే సమస్యలకు కారణమయ్యే అంశాల్లో ఒకటిగా పండితులు చెబుతున్నారు.
ఇళ్లలో పూజలు చేసే సమయంలో దేవుళ్ల విగ్రహాలు, పటాలు కాలక్రమేణా దెబ్బతినడం సహజం. అయితే పగిలిన విగ్రహాలు, చినిగిన దేవుడి పటాలు ఇంట్లో ఉంచితే ఎంత సంపాదించినా, డబ్బు నిలవదని, రోజురోజుకూ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని వారు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కూడా పగిలిన విగ్రహాలు, చినిగిన దేవుడి పటాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. పూజా మందిరంలోనే కాకుండా ఇంట్లో ఎక్కడైనా చినిగిన దేవుడి పటాలు ఉండకూడదని సూచిస్తున్నారు. ఇంటి పూజా మందిరంలో కొన్ని రకాల విగ్రహాలు పెద్ద సైజులో ఉంచకూడదని, విగ్రహాల పరిమాణం మూడు అంగుళాలకు మించకూడదని పండితుల అభిప్రాయం. అంతకంటే పెద్ద విగ్రహాలు ఉంటే సమీప దేవాలయానికి అప్పగించడం మంచిదని సూచిస్తున్నారు.
ఇప్పటికే ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉన్నవారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. రోజూ నిత్య దీపారాధన చేయడం, విగ్రహాల పరిమాణానికి అనుగుణంగా నైవేద్యం సమర్పించడం, వాటిని ప్రతిరోజూ నీటితో శుభ్రం చేసి అలంకరించడం, ధూపం, దీపం, నైవేద్యం నిరంతరం ఉండేలా చూడాలని పండితులు చెబుతున్నారు. ప్రస్తుత జీవన విధానంలో అందరికీ నిత్య పూజ సాధ్యం కాకపోవడంతో, ఈ నియమాలు పాటించలేని వారు పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉంచకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా పూజా గదిలో ఉన్న విగ్రహాలు అకస్మాత్తుగా పగిలిపోవడం, దేవుడి ఫోటోలు మురికిగా మారడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో వాటిని వెంటనే మార్చాలని, పగిలిన విగ్రహాలు, పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం వాస్తు దోషానికి కారణమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో దురదృష్టాన్ని ఆహ్వానిస్తాయని పండితుల అభిప్రాయం.







