ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే అతి ప్రాచీన ఉత్సవమే ఆణివార ఆస్థానం. వేలాది ఏళ్లుగా వైఖానస ఆగమ శాస్త్ర విధానాల ప్రకారం కొనసాగుతున్న ఈ వేడుకకు తిరుమలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

తెలుగు పంచాంగం ప్రకారం జులై 17, శుక్రవారం ఆషాఢ శుద్ధ తదియ రోజున సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ దినాననే శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివరై ఆస్థానం నిర్వహిస్తారు. ఆణివార ఉత్సవం పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు జరుగుతాయి.

ఉదయం బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంపై ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామిని గరుత్మంతుని వైపు ముఖంగా ఆశీనుల్ని చేస్తారు. అదే సమయంలో మరో పీఠంపై విష్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువుదీరుస్తారు. అనంతరం మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు నివేదిస్తారు.

ఈ సందర్భంగా పెద్ద జియ్యరు స్వామి వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు శిరసుపై ధరించి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు మూలవిరాట్టుకు, శ్రీ మలయప్ప స్వామికి, విష్వక్సేనుల వారికి సమర్పిస్తారు. వస్త్ర సమర్పణ అనంతరం జరిగే ‘లచ్చన్న’ కార్యక్రమం ఈ ఉత్సవంలో ప్రధాన విశేషంగా భావిస్తారు.

‘లచ్చన్న’గా పిలిచే శ్రీవారి ఆలయ తాళపు చెవుల గుత్తిని ముందుగా అర్చకులు, తరువాత పెద్ద జియ్యరు స్వామి, చిన్న జియ్యరు స్వామి, ఆలయ కార్యనిర్వాహక అధికారులకు వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. అనంతరం ఆ తాళపు చెవుల గుత్తిని శ్రీవారి మూలవిరాట్టు పాదాల సమీపంలో ఉంచుతారు. చివరగా హారతి, చందనం, తాంబూలం, తీర్థం, ప్రసాదం, శఠారి సమర్పణతో ఆణివరై ఆస్థానం ఉత్సవం ముగుస్తుంది.

దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశ దినాన జరిగే ఈ సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవను కూడా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా పుష్పాలతో అలంకరించిన పల్లకీలో తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

ఈ పుష్పపల్లకీ సేవలో భాగంగా వివిధ రకాల సుగంధభరిత, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించిన పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి కొలువుదీరుతారు. పల్లకీ ముందు భాగంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపరయుగంలో చిన్నికృష్ణుల విగ్రహాలు, వెనుక భాగంలో తమలపాకుల ప్రత్యేక అలంకరణలో హనుమంతుడు ఉంటారు. ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల కట్ ఫ్లవర్స్ కలిపి సుమారు ఒక టన్ను పుష్పాలతో జరిగే ఈ సేవను భక్తులు అపూర్వంగా భావిస్తారు.

పుష్పాలతో అలంకరించిన ఈ పల్లకీపై స్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతుండగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం పొందుతారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు, జీయరు స్వాములు, భక్తులు పాల్గొంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ ఆణివరై ఆస్థానం వేడుకను కళ్లారా దర్శించుకోవడం వల్ల అపార పుణ్యం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో బలంగా ఉంది.

పైన వివరించిన ఆధ్యాత్మిక విశేషాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించబడినవే. వీటిలో అన్నింటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చని పాఠకులు గమనించాలి. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.