రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం : అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాలలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ పి. పి. జగదీష్ IPS తెలిపారు.
అనంతపురం నగరంతో పాటు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాలలో ప్రస్తుతం 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సెక్షన్ పూర్తిగా అమల్లో ఉన్నాయని ఎస్పీ పి. పి. జగదీష్ IPS స్పష్టం చేశారు. చట్టం ప్రకారం అమల్లో ఉన్న ఈ నిబంధనల కారణంగా ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు.
ఐదుగురికి మించి గుంపులుగా గుమిగూడటానికి కూడా అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. ప్రజా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించే ఎవరినీ ఉపేక్షించబోమని, వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు. అమల్లో ఉన్న సెక్షన్లను తేలికగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని సూచించారు.
జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, యువకులు మరియు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని ఎస్పీ పి. పి. జగదీష్ IPS విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం ఉంటేనే శాంతి, భద్రతలు సమర్థవంతంగా కొనసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే, ముందస్తుగా సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించి, చట్టపరమైన అనుమతులు తీసుకోవాలని పోలీసు శాఖ సూచిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.













