గుత్తి:- మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు ఉద్రిక్తతలు, అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. గుత్తి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక సూచనలు చేశారు. గతంలో నామినేషన్ చివరి రోజున చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తరువాత కలెక్టర్ ఓ.ఆనంద్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైరేత్ బాక్సులు, స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సిబ్బంది నియామకంపై వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తరువాత మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆనంద్, నామినేషన్ ప్రక్రియ ఇప్పటివరకు ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. మొదటి రెండు రోజులు ఎలాంటి సమస్యలు లేకుండా నామినేషన్ దాఖలు జరిగిందని పేర్కొన్నారు. అయితే చివరి రోజు నామినేషన్ సమయంలో గొడవలు, ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశముందని, అందుకే ముందస్తు అప్రమత్తత అవసరమని ఆయన సూచించారు.

గతంలో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచి నామినేషన్ ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల నిబంధనలు, చట్టాలను కచ్చితంగా అమలు చేసి, ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని ఆయన సూచించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, తహశీల్దార్ పుష్పవతి, సీఐలు ధరణి కిశోర్, మహానంది, రాజు, ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లపై వారు కలెక్టర్‌కు వివరాలు అందించారు.