నందలూరు మండలం ఈదరపల్లి గ్రామంలో బీసీ కాలనీ స్థలంపై నెలకొన్న వివాదం గురువారం తీవ్రరూపం దాల్చింది. గ్రామంలో బీసీ కాలనీకి కేటాయించిన స్థలాన్ని రాయచోటి వెంకటరమణ కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

బీసీ కాలనీకి ప్రభుత్వం కేటాయించిన స్థలంపై అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనిపై పలుమార్లు నందలూరు తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, బీసీ కాలనీ స్థలాన్ని ఆక్రమణల నుంచి విముక్తి చేసి అసలు లబ్ధిదారులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ వివాదంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ పాత్రపై కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీసీ కాలనీ స్థలానికి సంబంధించిన అనుబంధ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రూ.4 లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు సమస్య పరిష్కారంలో ఆసక్తి చూపడం లేదని వారు ఆరోపించారు. దీనిపై ఆర్‌ఐ సుశీల్‌తో బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

తహసీల్దార్ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను కార్యాలయం ఆవరణ నుంచి బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే బాధితులు కార్యాలయం బయట రోడ్డుపై కూర్చుని నిరసన కొనసాగించారు.

రెవెన్యూ అధికారులు, బాధితుల మధ్య మాటామాటా తీవ్రంగా సాగింది. బీసీ కాలనీ స్థలంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, ఆక్రమణలను తొలగించి, అసలు లబ్ధిదారులకు స్థలాలు అందజేయాలని బాధితులు పట్టుబట్టారు. తమ సమస్యను తహసీల్దార్ ప్రత్యక్షంగా విని వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈదరపల్లి బీసీ కాలనీ స్థల వివాదం కారణంగా గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని సహగ్రామస్తులకు తెలిపారు. ఈ ఘటనపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, పోలీసు విభాగం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.