అన్నమయ్య జిల్లా రాయచోటిలో హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఎల్ఈడీ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఎల్ఈడీ ప్రచార రథాన్ని డీఎల్‌ఏటీఓ డా. ఎల్. రాధిక, డీసీహెచ్‌ఎస్ డా. లక్ష్మీ ప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, వ్యాధిపై ఉన్న అపోహల తొలగింపు, హెచ్ఐవీ పరీక్షల ప్రాధాన్యత, చికిత్స విధానం, ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఎల్ఈడీ వాహనం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

హెచ్ఐవీ వ్యాప్తికి సంబంధించిన అపోహలను తొలగించడంతో పాటు, హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి సామాజికంగా, మానసికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పేర్కొన్నారు.

దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఐవీని ముందుగానే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు ఏఆర్టీ చికిత్సను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు.

పీసీఎస్ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. చెన్నారెడ్డి మాట్లాడుతూ ఎల్ఈడీ ప్రచార వాహనం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, 95-95-99 లక్ష్యాలు, హెచ్ఐవీ పరీక్షలు, ఏఆర్టీ చికిత్స, సురక్షిత ప్రవర్తన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి. ఆనంద్ కుమార్, పీసీఎస్ఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ టి. స్వాతి, పీసీఎస్ఎస్ సిబ్బంది, ఏరియా హాస్పిటల్, ఐసీటీసీ సిబ్బంది, జనచేతన ప్రాజెక్ట్ మేనేజర్, ఎల్‌డబ్ల్యూఎస్ ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.