రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య: జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో HNSS, వెలుగల్లు, ఇరిగేషన్, జలధార తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హంద్రీ–నీవా నీరు సెప్టెంబర్ 12–15 తేదీల మధ్య మదనపల్లె ప్రాంతానికి చేరే అవకాశం ఉన్నందున, నీరు జిల్లాలోకి చేరిన వెంటనే తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వెంటనే ట్యాంకులను నింపేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె పట్టణానికి తాగునీటిని అందించే చిప్పిలి, ఎస్ఎస్ ట్యాంక్, గుడ్డివారిపల్లి ఎస్ఎస్ ట్యాంకులను తొలి ప్రాధాన్యతగా నింపాలని సూచించారు.
చిప్పిలి ట్యాంకులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తాత్కాలికంగా ఎత్తు పెంచే చర్యలు చేపట్టి, గత ఏడాదితో పోలిస్తే అధికంగా నీటిని నిల్వ చేయాలని కలెక్టర్ సూచించారు. గుడ్డివారిపల్లి ట్యాంకును కూడా పూర్తి సామర్థ్యంతో నింపాలని ఆదేశించారు. నీటి విడుదల, కాలువల ద్వారా సరఫరా, ట్యాంకుల నింపుదలను పగలు–రాత్రి నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ ప్రత్యేక బృందాల్లో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, APSPDCL, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ప్రతినిధులు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నీరు వృథా కాకుండా షెడ్యూల్ ప్రకారం, క్రమబద్ధంగా ట్యాంకులను నింపుతూ ప్రతి మున్సిపాలిటీకి తాగునీటి కొరత లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
వెలుగల్లు రిజర్వాయర్‌ను కూడా హంద్రీ–నీవా ప్రధాన కాలువ ద్వారా నింపేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెలుగల్లు రిజర్వాయర్‌ను తక్షణమే కనీసం 50 శాతం మేర నింపేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇందుకోసం సెప్టెంబర్ 3–5 తేదీల మధ్య నీటి సరఫరా ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెలుగల్లు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
అలాగే, హంద్రీ–నీవా కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అమ్మ చెరువును నింపేందుకు మదనపల్లె మున్సిపాలిటీ అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జలధార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న CSR పనులు, జలధార ఫేజ్–2 పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన పనులన్నింటినీ సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున, అందుబాటులోకి వచ్చే హంద్రీ–నీవా నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుగా తాగునీటి ట్యాంకులను నింపి ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో HNSS ఎస్ఈ విఠల్ ప్రసాద్, వెలుగల్లు ఈఈ భరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేష్, రిటైర్డ్ ఎస్ఈ వెంకట్రామయ్య, డీఈలు, ఏఈలు, జేఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.







