రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. ఆయన చేసిన విమర్శలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా బీసీ నేత చల్లా రాజగోపాల్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని రాచమల్లు మాట్లాడిన తీరును ఎత్తిచూపుతూ, ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని వరదరాజులరెడ్డి హెచ్చరించారు.
రాచమల్లు వ్యాఖ్యలకు తాను స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీలను కించపరిచేలా మాట్లాడితే తాము మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు. రాజకీయంగా విమర్శలు చేయాలంటే పరిమితులు పాటించాలని, వ్యక్తిగత దూషణలు, కులపరమైన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
“బీసీలను కించపరిచి మాట్లాడొద్దు.. పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగానే సమాధానం ఇస్తా”
చల్లా రాజగోపాల్ యాదవ్‌పై రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వరదరాజులరెడ్డి, రాజగోపాల్ తన స్నేహితుడని, ఆయన జోలికి వస్తే పరిణామాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు.
“రాజగోపాల్ నా స్నేహితుడు.. ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేదు. రాజకీయంగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.. నేను కూడా పద్ధతిగానే సమాధానం ఇస్తా. కానీ బీసీలను కించపరిచేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు”
చల్లా రాజగోపాల్ యాదవ్‌పైనే కాకుండా ఏ టీడీపీ నాయకుడు, కార్యకర్తపై అయినా అనుచితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు.
“చల్లా రాజగోపాల్ మీదే కాదు.. ఏ టీడీపీ కార్యకర్తపై అయినా చేయి వేసి చూడు.. నీకు తెలుస్తుంది. కార్యకర్తలకు అండగా నిలబడటం మా బాధ్యత”
బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచే ధోరణిని ఎంతమాత్రం సహించబోమని ఎమ్మెల్యే మరోసారి హెచ్చరించారు.
“బీసీలను కించపరిచి మాట్లాడతావా? బీసీలు నీకు బుద్ధి చెబుతారు. అహంకారం తగ్గించుకోకపోతే రాజకీయ పతనం తప్పదు”
రాచమల్లు చేసిన సవాళ్లపై కూడా వరదరాజులరెడ్డి స్పందించారు.
“నాలుక ఎప్పుడు కోస్తావో చెప్పు.. చూసుకుందాం”
ప్రొద్దుటూరు వ్యాపారుల అంశంపై రాచమల్లు తీసుకుంటున్న వైఖరిని కూడా వరదరాజులరెడ్డి విమర్శించారు. వ్యాపారులపై ప్రేమ పేరుతో రాజకీయ స్వార్థం నెరపుతున్నారని ఆరోపించారు.
“ప్రొద్దుటూరు వ్యాపారులపై రాచమల్లుకు ఉన్నది ప్రేమ కాదు.. కేవలం స్వార్థం మాత్రమే”
వ్యాపారం కోసం అప్పులు చేయడం సహజమని, అయితే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర తమది కాదని వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోకి భారీగా డబ్బులు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలను గతంలో తీసుకువచ్చారని ఆరోపించారు. ఇతరుల నుంచి వచ్చిన సొమ్ముతో దానధర్మాలు చేస్తున్నారంటూ రాచమల్లు వర్గంపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
“రాచమల్లు.. మాటలతో కాదు, ప్రజల మధ్య తేల్చుకుందాం”
రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా తాము ప్రజల మధ్యే ఉండి సమాధానం ఇస్తామని వరదరాజులరెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
“రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. బీసీలను కించపరిస్తే బీసీలు సమాధానం చెబుతారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు”
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో రాచమల్లు–వరద మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. ముఖ్యంగా చల్లా రాజగోపాల్ యాదవ్ అంశం చుట్టూ ఇరువర్గాల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.













