అనంతపురం కోవూరు నగర్‌లో వృద్ధురాలు చిన్న నాగమ్మ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఘటన నమోదు అయిన నాలుగు గంటల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు టౌన్ డీఎస్పీ కరుణాకర్ రావు తెలిపారు.

ఈ కేసు వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కోవూరు నగర్‌లో లక్ష్మీనారాయణ ఇంట్లో చిన్న నాగమ్మతో పాటు మొత్తం ఏడుగురు కలిసి నివాసం ఉంటున్నారని డీఎస్పీ చెప్పారు. వృద్ధురాలి వరుసకు మనవడు అయిన నారాయణస్వామి ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు.

నిందితుడు నారాయణస్వామి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ మద్యానికి బానిసగా మారాడని, తరచూ డబ్బుల కోసం ఇంట్లో గొడవలు పెట్టేవాడని డీఎస్పీ వివరించారు. వృద్ధురాలి చెవుల్లో ఉన్న బంగారు కమ్మలు ఇవ్వాలని నారాయణస్వామి ఆమెతో వాగ్వాదం పెట్టాడని, చిన్న నాగమ్మ కమ్మలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన నారాయణస్వామి పక్కనే ఉన్న రోకలిబండతో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు విచారణలో బయటపడిందని తెలిపారు.

హత్య అనంతరం చిన్న నాగమ్మ చెవుల నుంచి బంగారు కమ్మలు తీసుకుని నారాయణస్వామి అక్కడి నుంచి పారిపోయినట్లు డీఎస్పీ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని వివరించారు.

నారాయణస్వామి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రోకలిబండతో పాటు కట్టర్ బ్లేడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కరుణాకర్ రావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆయన చెప్పారు.