రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు ఇంజా సోమశేఖర రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
తరువాత జరిగిన సభలో ఇంజా సోమశేఖర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని ఉద్యోగులను, యువతను ఆయన పిలుపునిచ్చారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర తిలక్, అల్లూరి సీతారామరాజు మొదలైన దేశభక్తులు తమ ధన, మానప్రాణాలను తృణప్రాయంగా ధారవోసి స్వాతంత్ర్య సంపాదించారు. దీన్ని మనందరం కాపాడుకోవాలి. ముఖ్యంగా నేటి విద్యార్థులు దేశభక్తుల త్యాగాలు తెలుసుకోవాలి. అలా విద్యార్థి దశ నుంచి దేశభక్తి కలిగి ఉంటే లౌకిక సర్వసత్తాక రాజ్యం మన దేశంలో నెలకొంటుంది.
స్వాతంత్ర్య ఫలాలను సక్రమంగా కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా ఇంజా సోమశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో ఉద్యోగులు, విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను అనుసరించి సమాజ సేవకు ముందుకు రావాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, సంయుక్త కార్యదర్శి తోళ్ళ కిరణ్, సభ్యులు నాగేంద్ర రెడ్డి, CPUS రాష్ట్ర అదనపు కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు కోటా ఓబుళ రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న వారికి స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించే పత్రికలను పంపిణీ చేశారు. జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.







