ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెజాన్ ఇండియా కొత్త స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026-27’ పేరుతో ప్రారంభించిన ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఈ పథకం ద్వారా ఆర్థిక సాయంతో పాటు ల్యాప్‌టాప్, నిపుణుల మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కూడా కల్పించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేని విద్యార్థులకు అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సంస్థ తెలిపింది.

ఇంజినీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 30, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమని అమెజాన్ ఇండియా వెల్లడించింది.

ఇంజినీరింగ్ విద్యలో ట్యూషన్ ఫీజులు, వసతి, పుస్తకాల ఖర్చులు విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ ప్రకటించిన స్కాలర్‌షిప్ పథకం విద్యార్థులకు ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చి ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగపడనుంది.

దరఖాస్తు విధానం, ఎంపిక ప్రమాణాలు, అవసరమైన పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉన్న విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.