ఇంజినీరింగ్ విద్యార్థులకు సువర్ణ అవకాశం

డీఆర్‌డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో పుణెలో పనిచేస్తున్న ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) 2026-27 విద్యా సంవత్సరానికి పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఇంటర్న్‌షిప్‌ల కోసం అర్హులైన ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. శిక్షణ వ్యవధి 6 నెలలు. ఇంటర్న్‌షిప్ సమయంలో నిబంధనల ప్రకారం స్టైపెండ్ కూడా చెల్లించనున్నారు. ఎంపికైన ప్రతి ఇంటర్న్‌కు నెలకు రూ.5 వేల స్టైపెండ్ అందజేస్తారు. ఇంటర్న్‌షిప్ 2026 జులై 30 నుంచి ప్రారంభం కానుంది.

మెకానికల్, ఆర్మమెంట్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, ఎయిరో ఇంజినీరింగ్, రాకెట్ ప్రొపల్షన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్ తదితర విభాగాల్లో ఈ ఇంటర్న్‌షిప్‌లు ఇవ్వనున్నారు. సంబంధిత విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు అర్హత ప్రమాణాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్‌లో సంబంధిత విభాగంలో రెగ్యులర్ కోర్సు ద్వారా బీఈ లేదా బీటెక్‌లో 7వ లేదా 8వ సెమిస్టర్ చదువుతూ ఉండాలి. లేదా ఎంటెక్ మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతూ ఉండాలి. అభ్యర్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు. అకడమిక్ రికార్డులో కనీసం 75 శాతం మార్కులు లేదా 7.5 సీజీపీ ఉండాలి.

అభ్యర్థుల వయసు 2026 జూన్ 20 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తులు 2026 జులై 5లోపు చేరేలా పంపాలి. అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరగనుంది.

దరఖాస్తుతో పాటు తాజాగా దిగిన పాస్‌పోర్టు సైజు ఫోటోలు, కాలేజీ ప్రిన్సిపల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, సెమిస్టర్ మార్క్ షీట్లు, ఆధార్ కార్డు ప్రతులు, కాలేజీ ఐడీ కార్డు కాపీ, విద్యార్థి బయోడేటా 300 పదాల్లో జత చేయాలి.

దరఖాస్తులు ఈ చిరునామాకు పంపాలి: ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, డాక్టర్ హోమి బాబా రోడ్, పాషాణ్, పుణె – 411021.

ఇంజినీరింగ్, ఎంటెక్ చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు DRDO వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో అనుభవం సొంతం చేసుకునే మంచి అవకాశంగా ఈ ఇంటర్న్‌షిప్ స్కీమ్ భావిస్తున్నారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థులు గడువు తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.