దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే NEET PG–2026 పరీక్ష తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటించింది. ఈ పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నట్లు బోర్డు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతున్నారు. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అభ్యర్థులు NEET PG–2026 పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, ఫీజు వివరాలు తదితర సమాచారం NBE అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాల వివరాలను ఆగస్టు 11న ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

NEET PG–2026 పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు NBE స్పష్టం చేసింది. ఫలితాల ఆధారంగా దేశంలోని వివిధ మెడికల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియను సంబంధిత అధికార సంస్థలు నిర్వహించనున్నాయి.

NEET PG పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో డాక్టర్ అఫ్ మెడిసిన్ (MD), మాస్టర్ అఫ్ సర్జరీ (MS) మరియు ఇతర పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో మెడికల్ పీజీ చదవాలనుకునే అభ్యర్థులు నిర్ణయించిన గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని NBE సూచించింది.