రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన యువ నటి అనన్య రాజ్ (అనన్య సేన్ గుప్తా) 27 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2026 జూలై 15న ముంబైలో నిద్రలోనే ఆమె ప్రాణాలు విడిచారు. అయితే ఈ విషాదకర ఘటనను ఆమె కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల పాటు గోప్యంగా ఉంచి, ఆగస్టు 16న మాత్రమే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
1998 ఆగస్టు 10న జన్మించిన అనన్య రాజ్.. బాలీవుడ్‌లో ‘Ghost’, ‘7 Hours To Go’, ‘The Final Exit’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులో దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించిన ‘తగ్గేదే లే’ (2022) సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మోడల్‌గా, నటిగా రెండు రంగాల్లోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అనన్య కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఏడాది కాలంగా ఆమె తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ, చివరకు జూలై 15 తెల్లవారుజామున నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు వారు తెలిపారు. అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని కుటుంబం ఇప్పటివరకు వెల్లడించలేదు.
అనన్య మరణం జరిగిన వెంటనే ఈ విషయాన్ని బయటపెట్టకుండా, దాదాపు నెల రోజుల పాటు గోప్యంగా ఉంచడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చకు దారితీసింది. ఆమె అంత్యక్రియలను కూడా కుటుంబ సభ్యులు అత్యంత గోప్యంగా నిర్వహించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో దాదాపు లక్షన్నర మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అనన్య మరణ వార్త ఆలస్యంగా బయటకు రావడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
అనన్య చివరి సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మే 17న షూటింగ్ సెట్‌లో తీసుకున్న ఫొటోను పంచుకుంటూ ఆమె ఒక భావోద్వేగ సందేశం రాసింది.
ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది
అదే ఆమె చివరి పోస్ట్ కావడంతో అభిమానులు ఆ మాటలను గుర్తుచేసుకుని మరింత భావోద్వేగానికి గురవుతున్నారు. చిన్న వయసులోనే ఆమె సినీ ప్రయాణం ముగియడం అందరినీ కలిచివేస్తోంది. బాలీవుడ్, తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అనన్య రాజ్‌కు నివాళులు అర్పిస్తున్నారు.







