‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు గిరీష్ AD దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి నటించిన తాజా చిత్రం ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’. మమిత బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కేరళలో అతిపెద్ద పండుగ అయిన ఓనమ్ సందర్భంగా మలయాళంలో విడుదలై, అక్కడ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.

లవ్, ఫ్యామిలీ అంశాలను కలగలిపిన ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్ మలయాళంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నివిన్ పౌలి నటనకు అక్కడి ప్రేక్షకులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. రిలీజ్ అయిన మూడు రోజులలోనే ఈ చిత్రం సుమారు రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

మలయాళంలో ఇంతటి విజయాన్ని సాధించిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ విడుదల తేదీని హీరో నివిన్ పౌలి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది

ఈ చిత్రాన్ని భావనా స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్, ఫ్యూచర్ రన్-అప్ సంస్థలు సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. మలయాళంలో రికార్డులు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అదే నాణ్యతతో అందించేందుకు మేకర్స్ డబ్బింగ్ వెర్షన్ రూపంలో విడుదల చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చిత్రబృందానికి వచ్చింది. అయితే కథ, అందులోని భావోద్వేగాలు, సెన్సిబిలిటీస్ తెలుగులో రీమేక్ చేస్తే కొంత మేరకు మార్పులు చేయాల్సి వస్తుందని, అలా చేస్తే అసలు చిత్రంలోని ఆత్మ దెబ్బతింటుందని భావించి రీమేక్ ఆలోచనను పక్కన పెట్టారు. దీంతో ఒరిజినల్ మలయాళ వెర్షన్‌కే తెలుగు డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించారు.

‘ప్రేమలు’ తరహాలోనే ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. మలయాళంలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగులో ఎంతటి వసూళ్లు సాధిస్తుందో, సెప్టెంబర్ 4న విడుదలైన తర్వాత స్పష్టమవుతుంది.