మలయాళ చిత్రాల నటి మమితా బైజు అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన జ్వరం, శరీర నొప్పులతో బాధపడుతున్న ఆమెను వైద్యుల పర్యవేక్షణ కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమీప వర్గాలు తెలియజేశాయి.

సెప్టెంబర్‌ 5న ఆస్ట్రేలియాలో జరగాల్సిన ‘క్లైడ్‌ ఓనం 2026’ వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే ఆకస్మిక అనారోగ్యం కారణంగా ఆమె ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని క్లైడ్‌ మలయాళీ అసోసియేషన్‌ అధికారికంగా ప్రకటించింది.

మమితా ఆరోగ్య సమస్యల దృష్ట్యా ‘క్లైడ్‌ ఓనం 2026’ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ మేరకు వారు ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో మమితా తన ఆరోగ్య పరిస్థితి, ఆస్ట్రేలియా ప్రయాణం రద్దు గురించి అభిమానులకు వివరించారు.

“వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ప్రయాణం చేయలేకపోతున్నాను. ఆస్ట్రేలియాలోని అందరిని కలవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ఆరోగ్య కారణాల వల్ల రావడం సాధ్యపడలేదు. దీనికి అభిమానులందరినీ, నిర్వాహకులను క్షమించాలి. త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ అందరినీ కలుసుకుంటానని ఆశిస్తున్నాను”

ఇటీవలి కాలంలో వరుస విజయాలతో మమితా బైజు సినీ వర్గాల్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె నటించిన మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలోనే విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. ఈ విజయాలతో ఆమె కెరీర్‌ మరింత వేగం పుంజుకుంది.

ప్రస్తుతం మమితా నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్ధమైంది. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

మమితా అనారోగ్య వార్త తెలిసిన అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆమె, పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ చిత్రీకరణల్లో పాల్గొననున్నారు.