రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
‘ఆల్ఫా’.. స్పై లేదు.. ఓన్లీ యాక్షన్..: రివ్యూ
స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల నిర్మాణంలో యాష్ రాజ్ ఫిలిమ్స్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే చాలు యాక్షన్ ప్రేమికులకు పండుగే. ఇప్పటికే ఈ స్పై యూనివర్స్‌లో పలువురు కథానాయకులు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు అలియా భట్, శార్వారీ వాఘ్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘ఆల్ఫా’ పేరుతో వచ్చిన ఈ తాజా చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో పరిశీలిద్దాం.
సీత (అలియా భట్) అనాథ. ఆర్మీ ఆఫీసర్ ఫతేహ్ సింగ్ లఖావత్ (బాబీ దేవోల్) ఆమెను తన సొంత కూతురిలా పెంచుతాడు. కఠిన పరిస్థితుల్లోనూ నిలబడేలా, పోరాడేలా ప్రత్యేక శిక్షణ ఇస్తాడు. తరువాత సీత భారత ప్రభుత్వానికి విశేష సేవలందించిన పలువురిని దారుణంగా హత్య చేస్తుంది. ఆమె టార్గెట్ జాబితాలో RAW అధిపతి విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), తనను పెంచిన ఫతేహ్ సింగ్ కూడా ఉంటారు. కన్న తండ్రిలా చూసుకున్న ఫతేహ్ సింగ్‌ను సీత చంపాలనుకోవడానికి కారణం ఏమిటి? విక్రాంత్ కౌల్, ఆయన కుమార్తె దుర్గ (శార్వారీ వాఘ్), సీత మధ్య ఉన్న బంధం ఏమిటి? ఈ ముగ్గురూ ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది? భారత సైన్యం కోసం రూపొందించిన ప్రత్యేక సీరం ‘ఆల్ఫా’ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే శక్తులెవరు? ఆ సీరంతో సీతకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది తెరపై నెమ్మదిగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్లకు వెండితెరపై కొదవలేదు. అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల వచ్చిన ‘ధురంధర్’లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే స్పై జానర్‌ను అత్యంత భారీ హంగులతో, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దడంలో యాష్ రాజ్ స్పై యూనివర్స్ కి ప్రత్యేకత ఉంది. ‘ఆల్ఫా’ను కూడా అదే స్థాయిలో మలచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.
ఉదయ్ చోప్రా రాసిన ‘ఆల్ఫా’ సీరం కాన్సెప్ట్‌ను గ్రాండియర్‌గా చూపించడంలో దర్శకుడు శివ్ రావేల్ కొంతవరకు సఫలమయ్యారు. ‘ఆల్ఫా’ సీరంను సైనికులకు ఇవ్వడం ద్వారా వారి పోరాట సామర్థ్యం ఎలా పెరుగుతుందో, దాని ప్రయోజనాలు ఏమిటో చూపిస్తూ సినిమా మొదలవుతుంది. ప్రయోగదశలో ఉన్న ఆ సీరాన్ని తీసుకున్న సైనికులు మృతిచెందడం, ఆ ప్రాజెక్ట్ రద్దు కావడం కథకు కీలక మలుపు. అక్కడి నుంచి సీతకు ఫతేహ్ సింగ్ ఇచ్చే శిక్షణ, ఆమె ప్రదర్శించే నైపుణ్యాలు తదితర సన్నివేశాలతో కథానాయిక శక్తి సామర్థ్యాలను చూపిస్తూ, తర్వాత రాబోయే యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుడిని మానసికంగా సిద్ధం చేస్తాడు.
అయితే ‘ఆల్ఫా’ కథా ప్రపంచాన్ని పరిచయం చేయడంలో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. సీత వేట మొదలయ్యే వరకు అసలు కథ పట్టాలెక్కినట్టు అనిపించదు. ఫతేహ్ మనుషులను సీత వేటాడే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. సీత గతాన్ని గుర్తుచేస్తూ విక్రాంత్ కౌల్, దుర్గ నేపథ్యంలో సాగే విరామ సన్నివేశాలు, అక్కడి యాక్షన్ హంగామా ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచినా, ఇంటర్వెల్ తర్వాత కథ ముందుకు కదలడంలో ఆలస్యం అవుతుంది. సీత, దుర్గ పాత్రల ప్రయాణం కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది.
స్పై యూనివర్స్‌లో కబీర్ (హృతిక్ రోషన్)ను తీసుకొచ్చి, కొద్దిసేపు వెండితెరపై మెరిపించినా, అది కథను పెద్దగా మలుపుతిప్పలేదని అనిపిస్తుంది. ‘ఆల్ఫా’ సీరం కోసం సీత చుట్టూ జరుగుతున్న కుట్రలు, దాని వెనుకున్న వ్యక్తి ఎవరో తెలియజేసే ప్రీక్లైమాక్స్ ట్విస్ట్ కొంత ఆసక్తి కలిగిస్తుంది. చివర్లో హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌ను ముగించారు.
నటన పరంగా అలియా భట్ సీత పాత్రకు న్యాయం చేయడానికి శ్రమించినట్టు కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపించినా, ఇలాంటి పాత్రలు ఆమె ఆహార్యానికి పూర్తిగా సరిపోలవని భావన కలుగుతుంది. శార్వారీ వాఘ్, అనిల్ కపూర్ తమ పాత్రలను సమర్థంగా పోషించారు. బాబీ దేవోల్ పాత్ర కథలో కీలకం. ఆయన యాక్షన్, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా సినిమా సగటు స్థాయిలోనే నిలిచింది. దర్శకుడు శివ్ రావేల్ ఒక సింపుల్ కాన్సెప్ట్‌ను ఎంచుకుని, దానిని అంతే సింపుల్‌గా ప్రజెంట్ చేశారు. ఒకట్రెండు మెరుపులు తప్ప పెద్దగా థ్రిల్ పంచే సన్నివేశాలు లేవు. పూర్తి స్థాయి స్పై థ్రిల్లర్‌గా కాకుండా, స్పై యూనివర్స్‌లోకి ఇద్దరు మహిళా ఏజెంట్లను పరిచయం చేసే ప్రయత్నంగా ‘ఆల్ఫా’ కనిపిస్తుంది. కేవలం దీనికోసమే ప్రత్యేక కథ రాసుకుని, రెండున్నర గంటల సినిమాగా మలచాల్సిన అవసరం లేదనిపించేలా ఉంది. ఏదైనా స్పై యాక్షన్ మూవీ క్లైమాక్స్‌లో వీరి పాత్రలను పరిచయం చేసినా సరిపోయేదనే భావన కలుగుతుంది.
బలాల విషయానికి వస్తే యాక్షన్ సీక్వెన్స్‌లు, నటీనటుల నటన ప్లస్ పాయింట్లు. బలమైన కథావస్తువు లేకపోవడం, సుదీర్ఘంగా సాగే ఆరంభ సన్నివేశాలు మైనస్ పాయింట్లు. మొత్తానికి ‘ఆల్ఫా’లో స్పై థ్రిల్ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.
రేటింగ్: 2.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.







