రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 28న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించిన ఈ చిత్రాన్ని, అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేమని చిత్రబృందం తాజాగా అధికారికంగా వెల్లడించింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
భారీ స్థాయిలో రూపొందుతున్న ‘భోగి’పై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం. శర్వానంద్ ఇందులో ‘గంగా’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం ఏకంగా 30 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని మేకర్స్ వెల్లడించారు. పీరియడ్ వరల్డ్, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ స్కేల్‌ను మరింత అద్భుతంగా, నాణ్యతతో చూపించేందుకు ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘భోగి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయ్యాక కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.







