వీడియో విడుదల చేసిన నాగార్జున

బుల్లితెరపై ప్రేక్షకులను బాగా అలరించిన రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్‌’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లతో వినోదం పంచిన ఈ కార్యక్రమం ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ బాస్ తెలుగు 10’గా రానున్న ఈ కొత్త సీజన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వీడియోను హోస్ట్‌ నాగార్జున విడుదల చేశారు.ప్రముఖ నటుడు, హోస్ట్‌ అయిన నాగార్జున ఈ సారి కూడా షోను నడిపించనున్నట్లు సూచిస్తూ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. శక్తివంతమైన డైలాగ్‌తో ప్రారంభమైన ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది.

బిగ్‌బాస్‌.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం

అని నాగార్జున చెప్పే డైలాగ్‌తో వీడియో మొదలవుతుంది. ఆ తరువాత బిగ్‌బాస్‌ హౌస్‌, కంటెస్టెంట్‌ల పోటీ, టాస్క్‌ల ఉత్కంఠను సూచించేలా కట్‌ చేసిన విజువల్స్‌ వరుసగా కనిపిస్తాయి. బిగ్‌బాస్‌పై ప్రత్యేకంగా రూపొందించిన పాట కూడా ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే క్యాప్షన్‌తో కొత్త సీజన్‌ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో మేకర్స్‌ హింట్‌ ఇచ్చారు. గత సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అగ్ని పరీక్షలా సాగిన ఆడిషన్‌లను దాటి ఆరుగురు కామన్‌ కంటెస్టెంట్‌లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చూపించారు. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు వచ్చిన కామన్‌మ్యాన్‌ కల్యాణ్‌ పడాల బిగ్ బాస్ 9’ విజేతగా నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో బిగ్‌బాస్‌ వేదిక సామాన్యులకు కూడా పెద్ద అవకాశమని గత సీజన్‌ నిరూపించింది.

ఇప్పుడు పదో సీజన్‌ నేపథ్యంలో కూడా సామాన్యులకు అవకాశం ఇస్తారా? లేక ఈసారి కేవలం ప్రముఖులకే ఎంట్రీ ఇస్తారా? అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. అలాగే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌లు ఎవరు? షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి ప్రశ్నలకు ఇంకా అధికారిక సమాధానాలు రాలేదు. అయితే నాగార్జున విడుదల చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌ వీడియోతో బిగ్ బాస్ తెలుగు 10’ సిద్ధమవుతోందన్న విషయం స్పష్టమైంది. షోకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రసార తేదీ, కంటెస్టెంట్‌ల జాబితా వంటి అంశాలపై సమాచారం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని షో అభిమానులు భావిస్తున్నారు.