‘కల్కి’, ‘శుభం’ వంటి చిత్రాల్లో నటించిన హర్షిత్ రెడ్డి కథానాయకుడిగా వచ్చిన తాజా ప్రేమకథా చిత్రం ‘దీవానా’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్హ మీడియా, వి.స్టూడియోస్ సంస్థల నిర్మాణంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైన ఈ చిత్రం బలమైన ప్రచారంతో యువతలో ఆసక్తి రేపింది.

కథ విషయానికి వస్తే– మున్నా (హర్షిత్ రెడ్డి) డిగ్రీ పూర్తి చేసిన యువకుడు. ఏ పని చేయకుండా తల్లిదండ్రుల (వీకే నరేష్, ఝాన్సీ) కష్టంపైనే ఆధారపడుతూ స్నేహితులతో తిరుగుతూ, సరదాలు, గ్యాంగ్ ఫైట్లతో రోజులు గడిపేస్తుంటాడు. ఇంట్లో చిన్న పని చెప్పినా చిరాకు పడే స్వభావం. అలాంటి మున్నా జీవితంలో అమూల్య అలియాస్ అమ్ము (స్మేహ మణిమేగలై) ప్రవేశిస్తుంది. ఆమెను చూసిన క్షణం నుంచే ఆమెపైనే మనసు పారేసుకుంటాడు. ప్రపంచంలో తనకంటే అందమైన అమ్మాయి లేదనుకునేంతగా ఆమెపై మోజు పెంచుకుంటాడు.

అమూల్య ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకున్న మున్నా ప్రతిరోజూ అక్కడికే వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. అయితే ఆమె మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తూనే ఉంటుంది. అయినా మున్నా వెనక్కి తగ్గడు. చివరికి అమూల్య, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వస్తేనే తన ప్రేమను పరిగణలోకి తీసుకుంటానని షరతు పెడుతుంది. ఆమె మనసు గెలుచుకోవాలంటే ఏమైనా చేస్తానని నిర్ణయించుకున్న మున్నా ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇదిలా ఉండగా అనూహ్యంగా అతని జీవితంలో ఓ పెద్ద మలుపు తిరిగి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి వస్తుంది. మున్నా జీవితంలో ఏం జరిగింది? ప్రభుత్వ ఉద్యోగం దొరికిందా? అమూల్య ప్రేమను గెలుచుకున్నాడా? అనేదే మిగతా కథ.

కథ లైన్ పరంగా చూస్తే కొత్తదేమీ లేదనిపించినా, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి నేటితరం అభిరుచికి తగ్గట్టు చెప్పే ప్రయత్నం చేశారు. వన్‌సైడ్ ప్రేమకథకు నేటి ట్రెండ్‌లో భాగమైన షాకింగ్ అంశాన్ని జోడించిన తీరు చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రేమతో పాటు స్నేహం, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే సన్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండాయి.

పోలీస్ స్టేషన్‌లో మొదలయ్యే కథలో, మున్నా తన కథను అక్కడున్న గ్యాంగ్‌కు చెప్పే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో అల్లరి, స్నేహితులతో సరదా సన్నివేశాలు మొదట్లో నవ్వులు పంచుతాయి. అమూల్యను చూసిన తర్వాత కథ ప్రేమకథగా మలుపు తిరుగుతుంది. ఆమె చుట్టూ తిరుగుతూ ప్రేమను వ్యక్తం చేసే ప్రయత్నాలు, స్నేహితురాలి సహాయం, పాటల చిత్రీకరణ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే షాకింగ్ ఎలిమెంట్ సినిమాను మరో మలుపు తిప్పుతుంది. నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఆ సన్నివేశాలు రూపుదిద్దుకున్నాయి. ద్వితీయార్థంలో భావోద్వేగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు, మళ్లీ కలిసే సందర్భాలు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే పోరాటం, తండ్రి–కొడుకు మధ్య సంఘర్షణ, పోలీస్ స్టేషన్ నుంచి బయటపడే డ్రామా వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

హర్షిత్ రెడ్డి నటన చిత్రానికి ప్రధాన బలం. సంభాషణలు చెప్పిన తీరు, భావోద్వేగ సన్నివేశాల్లో చూపిన నైపుణ్యం పాత్రను నమ్మదగ్గదిగా నిలబెట్టాయి. స్మేహ మణిమేగలై అందంతో పాటు నటనలోనూ మెప్పించింది. ఆమె స్నేహితురాలి పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంది. వీకే నరేష్ తండ్రి పాత్రలో మళ్లీ తనదైన ముద్ర వేశారు. ఎక్కువ మాటలు లేకుండానే భావోద్వేగాన్ని చేరవేశారు. ఝాన్సీ తల్లి పాత్రలో హృదయానికి హత్తుకునే నటన కనబరిచింది. బలగం వేణు, అదుర్స్ రఘు తదితరులు తక్కువ సమయంలోనే ప్రభావం చూపారు.

సాంకేతికంగా ‘దీవానా’ బాగానే నిలిచింది. ఈశ్వర్ చంద్ సంగీతం, ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చాయి. వంశీ కెమెరా పనితనం ప్రేమకథకు కావాల్సిన మూడ్‌ను సృష్టించింది. తొలి చిత్రమే అయినా దర్శకుడు కథను రాసుకున్న తీరు, తెరపైకి తీసుకువచ్చిన విధానంలో స్పష్టత కనబర్చారు.

మొత్తానికి, తెలిసిన కథను నేటి ట్రెండ్‌కు తగ్గట్టు, భావోద్వేగాలు, షాకింగ్ ఎలిమెంట్ల మేళవింపుతో చెప్పిన న్యూ ఏజ్ ప్రేమకథగా ‘దీవానా’ నిలిచింది. ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాల మిశ్రమం కోరుకునే ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్:- 3/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)