హర్యానా సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, గాయకుడు అంకిత్ బాల్యన్ దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యూట్యూబ్‌లో తన పాటలు, డిజిటల్‌ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అంకిత్‌ను బుధవారం రాత్రి దుండగులు కాల్చిచంపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్‌ బయట ఈ ఘటన జరిగింది. జిమ్‌ నుంచి బయటకు వస్తున్న అంకిత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు 18 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే అంకిత్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ హత్య జరిగిన కొద్ది గంటల్లోనే తమే ఈ దాడికి కారణమని ప్రకటిస్తూ ‘జితేందర్ మన్ గోగి గ్యాంగ్’ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వెలుగుచూసింది. అంకిత్ హత్యపై నేరుగా బాధ్యత వహిస్తున్నట్టు ఆ గ్యాంగ్‌ ప్రకటించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్‌ ప్రపంచంతో పాటు సంగీత పరిశ్రమ, రాజకీయ వర్గాల్లోనూ ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

‘భోలూ సహాపురియా’ అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి ఈ పోస్ట్‌ బయటకు వచ్చింది. 2021లో దిల్లీలోని రోహిణి కోర్టు గదిలో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్ గోగిని ప్రత్యర్థులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనను ఉద్దేశిస్తూ అంకిత్ మూడు సంవత్సరాల క్రితం ‘కోర్ట్ మే గోలీ’ అనే పాట రూపొందించాడని, తమ శత్రువులకు మద్దతుగా ఆ పాట రాశాడని గోగి ముఠా ఆరోపణలు చేసింది. తమ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారందరికీ ఇదే పరిణామం ఎదురవుతుందనే హెచ్చరికలతో ఆ పోస్టులో వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ హత్య వెనుక పాటల వివాదం మాత్రమే కాకుండా రాజకీయ వైరం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంకిత్ సిద్ధమవుతున్నాడనే కథనాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతని హత్యకు రాజకీయ కోణం కూడా ఉండొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

అంకిత్ హత్యను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన విమర్శించారు. అంకిత్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గోగి గ్యాంగ్‌ పేరుతో వచ్చిన సోషల్‌ మీడియా పోస్టుల నిజానిజాలు, హత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు.