హాలీవుడ్ సినిమాలకు భారతదేశంలో విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాల ఒరిజినల్ వెర్షన్లు భారతీయ థియేటర్లలో యథాతథంగా ప్రదర్శితం కావడం లేదు. మన దేశ సామాజిక, సాంస్కృతిక నిబంధనలను దృష్టిలో ఉంచుకుని విదేశీ చిత్రాల్లోని హింస, ఆసభ్యకర సంభాషణలు, రొమాంటిక్ దృశ్యాలపై భారతీయ సెన్సార్ బోర్డు కఠినంగా కత్తెర వేస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో సెన్సార్ ఆంక్షలను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన చిత్రాలు ఈ ధోరణికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తాజాగా మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ మూవీ స్పైడర్ - మ్యాన్: బ్రాండ్ న్యూ డే విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారతీయ అభిమానులకు చిన్నపాటి నిరాశ ఎదురైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు UA 13+ సర్టిఫికేట్ జారీ చేసినా, అందులోని 8 సెకన్ల లిప్ లాక్ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీనికితోడు ఆడియో, సబ్‌టైటిల్స్‌లో ఉన్న కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్ చేయించడంతో పాటు మద్యం సీన్లలో హెచ్చరిక కార్డులను జోడించిన తర్వాతే 2 గంటల 24 నిమిషాల నిడివితో విడుదలకు అనుమతి ఇచ్చారు.

కేవలం స్పైడర్ - మ్యాన్ చిత్రమే కాకుండా ఇతర ప్రముఖ హాలీవుడ్ చిత్రాలపై కూడా గతంలో ఇదే తరహా వేటు కొనసాగింది. అబ్సెషన్ అనే హారర్ థ్రిల్లర్ చిత్రానికి A సర్టిఫికేట్ ఇచ్చినా, అందులోని 38 సెకన్ల తీవ్రమైన హింస, గ్రాఫిక్ రొమాన్స్, నగ్నత్వ దృశ్యాలను సెన్సార్ బోర్డు తొలగించింది. అలాగే స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన Disclosure డే చిత్రంలో పలు బూతు పదాలతో పాటు సెక్స్ అనే పదాన్ని మ్యూట్ చేసి, చివరి నిమిషంలో క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు మార్వెల్ బ్లాక్‌బస్టర్ డెడ్ పూల్ & వుల్వరైన్ చిత్రంలో మితిమీరిన రక్తపాతం ఉన్న సీన్లను తగ్గించడంతో పాటు, భారతీయ సంస్కృతి లేదా మతపరమైన అంశాలకు ఇబ్బంది కలిగించేలా ఉన్న సంభాషణలను బోర్డు మార్పులు చేయించింది. అలాగే ప్రజాదరణ పొందిన ఫాస్ట్ & ఫురిఎస్ వంటి యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రాలలో కూడా మితిమీరిన స్టంట్ హింసను ట్రిమ్ చేయడం, బూతు పదాలు, మహిళలను తక్కువ చేసి మాట్లాడే డైలాగ్‌లకు కట్స్ చెప్పడం పరిపాటిగా మారింది.

ఈ తరహా సెన్సార్ కట్స్ వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో సినీ ప్రేమికుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వయోపరిమితి ఆధారంగా (UA 13+, A) రేటింగ్స్ ఇస్తున్నప్పుడు, రొమాంటిక్ మరియు యాక్షన్ సీన్లను ఎందుకు ట్రిమ్ చేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే సెన్సార్ నిబంధనలు, వాటి చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతున్నా, భారత్‌లో హాలీవుడ్ చిత్రాలకు ఉన్న క్రేజ్, బాక్సాఫీస్ వద్ద వస్తున్న భారీ ఓపెనింగ్స్ ఏమాత్రం తగ్గకపోవడం పరిశ్రమ వర్గాలు గమనిస్తున్న అంశంగా మారింది.