రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమా గురించి మొదటి నాటి నుంచే వివిధ ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టైటిల్ బయటకు వచ్చినప్పటి నుండి, అనంతరం విడుదలైన రవితేజ లుక్స్ చూసి ఈ చిత్రం డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందా? శబరిమల నేపథ్యంతో కథ నడుస్తుందా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువయ్యాయి.
ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించిన స్టిల్స్ ఎక్కువగా ఉండటం, మరికొన్ని లుక్స్‌లో తాగుడుకు బాగా అలవాటు పడిన వ్యక్తిగా కనిపించడం వల్ల కథపై అనేక రకాల వార్తలు, అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా శబరిమల దేవాలయాన్ని నేపథ్యంగా తీసుకుని కథ నడుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా ముందుకు వచ్చి ఈ రూమర్లకు తెరదించారు. శబరిమల దేవాలయానికి, అక్కడి కథలకు ‘ఇరుముడి’ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో కథానాయకుడి జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఒక భాగం మాత్రమేనని, దాన్ని కథలో సంఘర్షణకు నేపథ్యంగా ఉపయోగించుకున్నానని తెలిపారు.
అయ్యప్ప భక్తులు దీక్షలో ఉండే 41 రోజుల కాలంలో తమ నియమాలు, అలవాట్ల విషయంలో కట్టుదిట్టంగా ఉంటారు. వ్యసనాలకు బానిసైన ఒక వ్యక్తి ఈ దీక్ష తీసుకుంటే, అతడు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ మార్పు అవసరం, అంతర్గత పోరాటం వల్లే కథలో సంఘర్షణ మొదలవుతుందని శివ నిర్వాణ వివరణ ఇచ్చారు.
హీరో పాత్రలో మలుపు కోసం కఠినమైన నియమాలు ఉండాలి కాబట్టే అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అంతే తప్ప ఈ సినిమా శబరిమలకు సంబంధించిన కథ కాదు. 41 రోజుల కథే స్క్రీన్‌ప్లేకి ప్రధాన బలం.
దీక్షకు ముందు హీరో జీవితంలో ఏం జరిగింది, దీక్షలో ఉన్న సమయంలో అతని చుట్టూ ఏం జరుగుతుంది, ఆ మార్పులు అతని వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి వంటి అంశాలు కథను ఆసక్తికరంగా మలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు.
రవితేజకు జోడీగా Priya Bhavani Shankar నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, శబరిమలపై వచ్చిన అపోహలను దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో కథపై కొత్త చర్చ మొదలైంది.







