రాయలసీమ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ నటుడు జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్టు బహిరంగంగా ప్రకటించడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జగపతి బాబు, చాలా కాలం తర్వాత హీరోగా చేసిన ‘వదల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ప్రకటన వెలువడింది.
హీరోగా జగపతి బాబు క్రేజ్ తగ్గి చాలాకాలం అవుతోంది. తాజాగా ఆయన నటించిన ‘వదల’ సినిమాను ఎవరూ థియేట్రికల్‌గా కొనకపోవడంతో, స్వయంగా ఓన్ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలాంటి సమయంలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, జగపతి బాబుతో కామెడీ సినిమా చేయబోతున్నట్టు చెప్పడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘వదల’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ రావిపూడి, స్టేజ్‌పై జగపతి బాబుతో తనకు జరిగిన సంభాషణను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా జగపతి బాబు, అనిల్ దర్శకత్వంలో కామెడీ సినిమా చేయాలన్న తన కోరికను బయటపెట్టినట్టు తెలిపారు. అదే వేదికపై త్వరలో తమ కాంబినేషన్‌లో పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ రాబోతుందని అనిల్ ప్రకటించాడు. అయితే అది తన తదుపరి సినిమా అవుతుందా లేదా అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
ఇటీవల వరుసగా రెండు 300 కోట్ల సినిమాలు, సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వరప్రసాద్’ విజయాలతో అనిల్ రావిపూడి రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్ రామ్‌లతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన, ఆ తర్వాత బాలకృష్ణతో మరో ప్రాజెక్ట్ ఉంటుందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
కెరీర్ ప్రారంభంలో కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, రవితేజ వంటి హీరోలతో సినిమాలు చేసి హిట్లు అందుకున్న అనిల్, ‘F2’ తర్వాత మాత్రం ఎక్కువగా స్టార్స్‌తోనే పని చేశాడు. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’, బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’, చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్’ వంటి భారీ విజయాలు సాధించాడు. వెంకటేష్‌తో ఐదో సినిమాను చేస్తుండగా, ‘పటాస్’తో తనకు అవకాశం ఇచ్చిన కల్యాణ్ రామ్‌ను మళ్లీ హీరోగా తీసుకుని కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు.
ఇలా వరుసగా స్టార్స్, మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న అనిల్, హీరోగా ఇమేజ్ తగ్గిన జగపతి బాబుతో సినిమా ప్రకటించడంపై ఇండస్ట్రీలో వివిధ రకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో సినిమాలు తీయడం తనకు సులభమని, ఇదీ అదే తరహా కామెడీ ఎంటర్‌టైనర్ అవుతుందని ఈవెంట్‌లోనే అనిల్ స్పష్టం చేశాడు.
‘F2’ నుంచి మొదలైన మల్టీస్టారర్ ఫార్ములాను అనిల్ నిరంతరం కొనసాగిస్తున్నాడు. ఇద్దరు హీరోల కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన, ‘మన శంకర వరప్రసాద్’లో ఇద్దరు సీనియర్ స్టార్స్‌ను కలిపాడు. ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్ రామ్‌లతో చేస్తున్న సినిమా కూడా అదే తరహాలోనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జగపతి బాబుతో అనౌన్స్ చేసిన కొత్త కామెడీ సినిమాలో కూడా మరో హీరో ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
జగపతి బాబుతో కలిసి నటించేది సీనియర్ హీరోనా, స్టార్ హీరోనా అన్న ఆసక్తికర చర్చ ఫిల్మ్ నగర్‌లో మొదలైంది. అనిల్ రావిపూడి విజన్‌లో ఎవరు ఉన్నారన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్‌గానే మిగిలేలా ఉంది.







