సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు

మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుతో రూపొందిన ‘జైలర్‌’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్‌ 2’ షూటింగ్‌ పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు టీమ్‌ తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ‘జైలర్‌ 2’ ప్రధాన చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. అయితే కథలో మరికొన్ని కొత్త సన్నివేశాలు జోడించాలని దర్శకుడు నెల్సన్‌ నిర్ణయించడంతో, అదనంగా 25 రోజుల పాటు మరో షెడ్యూల్‌ నిర్వహించారు. తాజాగా ఆ అదనపు చిత్రీకరణ కూడా ముగిసినట్లు టీమ్‌ స్పష్టం చేసింది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల హృతిక్‌ చెన్నైకి వెళ్లిన నేపథ్యంలో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘జైలర్‌ 2’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉండే దసరా సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీని ఖరారు చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. విడుదల తేదీపై క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

‘జైలర్‌’లో పలు భాషలకు చెందిన అగ్రతారలు అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. రెండో భాగంలోనూ అదే తరహా స్టార్‌ కాస్టింగ్‌ కొనసాగనుందని సమాచారం. సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కూడా ‘జైలర్‌ 2’లో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర చుట్టూ కథలో ముఖ్యమైన మలుపులు తిరుగుతాయని చిత్ర యూనిట్‌కు దగ్గర వర్గాలు చెబుతున్నాయి.

మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్‌ కథను ప్రారంభించనున్నట్లు నటుడు శివరాజ్‌ కుమార్‌ గతంలో పేర్కొన్నారు. ‘జైలర్‌’లో ఆయన పోషించిన పాత్రకు ‘జైలర్‌ 2’లో మరింత విస్తృత స్థాయిలో ప్రాధాన్యం ఉండబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌ అభిమానులతో పాటు యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకులు ఈ సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.