రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: తమిళనాడు సీఎం, దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించాడు.
ఎన్నో వాయిదాలు, వివాదాల అనంతరం ‘జన నాయగన్’ జూలై 23న విడుదలైంది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తెలుగులో బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాను ఆధారంగా చేసుకుని విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, తమిళ్‌లో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది.
ఇప్పటికే థియేటర్ రన్ కొనసాగుతున్న ‘జన నాయగన్’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ZEE5 సొంతం చేసుకుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ZEE5 అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రోమోను కూడా విడుదల చేసింది.
థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు సాధారణంగా కొంత కాలం తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు వస్తుంటాయి. అయితే ‘జన నాయగన్’ విషయంలో మాత్రం త్వరితగతిన ఓటీటీ రిలీజ్‌ను ప్లాన్ చేయడం గమనార్హం.
కథ విషయానికి వస్తే… ఖైదీగా జైలు జీవితం ముగించుకుని బయటకు వచ్చిన వెట్రి కొండాన్ (విజయ్), ప్రమాదంలో మృతి చెందిన జైలు అధికారి కుమార్తె విజ్జి (మమితా బైజు)ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. ఆఫ్రికా దేశాలను సైతం వణికించిన అంతర్జాతీయ క్రిమినల్ జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. విజ్జిని చంపడానికి అతను ఎందుకు ప్రయత్నిస్తాడు? దేశంలో విద్వేషాలు రగల్చేందుకు వేసిన కుట్రను వెట్రి కొండాన్ ఎలా తిప్పికొట్టాడు? అనే ఆసక్తికర కథాంశంతో సినిమా ముందుకు సాగుతుంది.
విజయ్, మమితా బైజు నటనకు ప్రశంసలు లభించినప్పటికీ, తెలుగులో ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ, శ్రీలీల చూపిన భావోద్వేగాన్ని ఈ చిత్రంలో అంతగా అనుభవించలేదని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చిన ‘జన నాయగన్’ ఓటీటీ వేదికపై ఎలా రాణిస్తుందో, సీఎం విజయ్ సార్‌కు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఎంత మేర విజయాన్ని అందిస్తుందో చూడాల్సి ఉంది.







